Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో ఏమి జరుగుతోంది...?
- ఢిల్లీలో భట్టి..హైదరాబాద్‌లో వ్యతిరేకుల భేటీ
- 'రేణుకా' ఇంట సమావేశానికి డీసీసీ నేతల దూరం
- రేవంత్ చెంతకు సంభాని..వీరయ్య విముఖత
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొందరు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని జీర్ణించుకోలేక పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యంగా భట్టి వర్గానికి రేవంత్ నియామకం రుచించట్లేదా? అంటే 'కొంచెం ఇష్టం...కొంచెం కష్టం' అనే రీతిలో చెబుతున్నారు. ఇక కాంగ్రెస్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమా నులైతే...రేవంత్‌కు టీపీసీసీపగ్గాలిచ్చినప్పటి నుంచి 'ఎల్లో కాంగ్రెస్'గా అభివర్ణిస్తున్నారు. ఇవన్నీ ఇలావుంటే శుక్రవారం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు సుమారు 300 మంది కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఇంట రేవంత్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్కను ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ పిలవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఆయన్ను సీఎల్పీ నేతగా తప్పించి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆ బాధ్యతలు ఇస్తారని భట్టి వ్యతిరేకవర్గం మాట. ఇన్నిరోజులుగా పెండింగ్‌లో ఉన్న టీపీసీసీ అధ్యక్ష, కార్యవర్గ నియామ కాన్ని ఉన్నఫళంగా ప్రకటించడానికి కారణం భట్టీ దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో కేసీఆర్‌ను కలవడమే ననే చర్చ నడుస్తోంది. ఆ విషయంపై వివరణ తీసుకునేందుకే హైకమాండ్ భట్టిని ఢిల్లీకి పిలిచినట్లు టాక్.
- సంభానిసై...పోడెం నై....
ఇక రేణుకాచౌదరి హైదరాబాద్‌లోని తన నివాసంలో నూతన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల భేటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఈ భేటీకి 30 మంది వరకే పిలుపు అందినా సుమారు 300 మంది వరకు వెళ్లడం గమనార్హం. అలా వెళ్లిన వారిలో ఉమ్మడి జిల్లా డీసీసీ నేతలు, ముఖ్యంగా భట్టి అనుయాయులు ఎవరూ లేకపోవడంపై చర్చ నడుస్తోంది. నూతన కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమితుడైన పీసీసీ మాజీ అధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. వర్కింగ్ ప్రెసిడెం ట్‌గా నియమి తుడైన భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య దూరంగా ఉన్నారు. వీరయ్య భట్టి వర్గీ యుడు కాబట్టే వెళ్లలేదని అంటున్నారు. ఇక ఈ భేటీకి హాజరైనవారిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, రాయల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహారావు, దీపక్‌చౌదరి, మేలం శ్రీనివాస్, కట్ల రంగారావు, మనోహర్‌నాయుడు, కార్పొరేటర్లు పల్లెబోయిన చంద్రం, ఎండీ రఫీదాబేగం, మరో ఇద్దరు కార్పొరేటర్లతో పాటు నాయకులు చోటా బాబా, దొడ్డా అశోక్, పైడిపల్లి కిషోర్, బుక్కా కృష్ణ, లెనిన్, నాగేందర్, మండెపూడి అప్పారావు, మనోహర్ నాయుడు, చిలుకూరి కిరణ్ తదితరులు రేణుకా ఇంటికి వెళ్లినట్లు సమాచారం. కానీ ఈ భేటీకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జావీద్ తదితరులు గైర్హాజరుకావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా డీసీసీలో భట్టి అనుయాయులుగా ఉన్న నేతలే ఈ సమావేశానికి వెళ్లలేదని తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా రేవంత్ ' అందరం కలిసి పనిచేద్దాం. ఈ రెండేళ్లు అందరం కలిసి పోరాడితే కాంగ్రెస్ అధి కారంలోకి వస్తుంది.' అని మాట్లాడకొచ్చినట్లు సమా చారం. 7వ తేదీన పీసీసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంపై కొద్దిసేపు చర్చించినట్లు తెలిసింది.
- ముస్తఫాకు రేవంత్ ఫోన్
57 డివిజన్ కార్పొరేటర్ రఫీదాబేగం భర్త ముస్తఫా పీడీ యాక్టు కేసులో అరైస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ముస్తఫాతో రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి ఫోన్లో సంభాషించారు. ముస్తఫా సోదరులు, ఆయన భార్య ములాఖత్ తీసుకోవడంతో ఆ సమయంలో వీడియో కాల్ చేసి వీరిద్దరూ మాట్లాడారు. 'నిన్ను నేను చూసుకుంటాను ముస్తఫా భారు...నీకు ప్రాబ్లం ఏమీ లేదు' అని రేవంత్ ధైర్యం నూరిపోశారు. 'నువ్వు హీరోవు కాబట్టే నిన్ను సతాయిస్తున్నారు. పార్టీ మొత్తం అండగా ఉంటుంది. బేఫికర్‌గా ఉండు' అని రేణుకాచౌదరి భరోసా ఇచ్చారు.