Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీధిలో నాటువేసి నిరసన తెలిపిన మహిళలు
- మరమ్మత్తు చేయాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కారేపల్లి
మండలకేంద్రమైన కారేపల్లిలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవటం లేదంటూ ఇమ్మడి బజార్ మహిళలు శుక్రవారం రోడ్డుపై నాటు వేసి నిరసన తెలిపారు. తమ బజారును అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. కారేపల్లి పంచాయతీల్లో రహదారుల పరిస్ధితిని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. ఇమ్మడి బజార్ పరిస్ధితిపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర మాట్లాడుతూ కారేపల్లిలో ప్రధాన రహదారి తప్ప మిగతా అంతర్గత రహదారులు పరిస్ధితి దారుణంగా ఉందన్నారు. రైల్వే స్టేషన్ రోడ్, బీసీ కాలనీ, అంబేద్కర్ నగర్లలో వీధులు బురదమయంగా మారి పాదచారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇమ్మడి బజార్లో చిన్నవర్షానికి వీధుల్లో నిండ నీరు చేరి చెరువును తలపిస్తుందన్నారు. రాజీవ్‌గాంధీ బొమ్మ సెంటర్ నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు రోడ్డుకిరువైపుల చెత్తకుప్పలు, పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయన్నారు. అంబేద్కర్‌నగర్ ఏకాంబరం ఇంటి ప్రాంతంలో నడవ లేని స్ధితి ఉందని అయినా దానిని పట్టించుకున్న పాపాన లేదన్నారు. పల్లె ప్రగతి ప్రచార ఆర్భాటమే తప్ప పారిశుధ్యం సమస్య తీరటం లేదన్నారు. కోట్లాది రూపాయల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజల బాధలను తీర్చటంలో విఫలమవుతుందని విమర్శించారు. ఆధికార యంత్రాంగం అప్రమత్తమై కారేపల్లితో పాటు గ్రామాల్లో సమస్యలను వెంటనే పరిష్కరింఛాలని డిమాండ్ చేశారు. పరిష్కారం చూపకుంటే ప్రజలను సమీకరించి అందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ముండ్ల ఏకాంబరం, అన్నారపు కృష్ణ, రాచబండి రామకృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.