Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
అదును దాటుతున్నా మండలంలో పంటల సాగు అంతంతమాత్రంగానే ఉంది. సాగుకు అనుకూలించే విధంగా నైరుతి రుతుపవనాలు అన్నదాతల్లో ఆశల నింపాయి. ఆరంభంలో కురిసిన వర్షాలతో పంటల సాగు దండిగా సాగుతుందన్న అంచనాలతో అన్నదాత గంపెడాశతో సాగుకు సమాయత్తమయ్యారు. తొలకరి పులకరింతతో విత్తనాలు వేయటం ప్రారంభించారు. భూములు చదును చేసుకోవడం, దుక్కులు, విత్తనాలు సిద్ధం చేసుకోవడం వంటి పనుల్లో నిమగమయ్యారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు తప్ప పెద్ద వర్షం లేక అన్నదాతలకు నిరీక్షణ తప్పటం లేదు. ఈ వానాకాలం సీజన్ జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంలోనే వచ్చాయి. కానీ పంటల సాగు సమయంలో మాత్రం ముఖం చాటేసాయి. మండలంలో వానాకాలంలో పత్తి 19900 ఎకరాల్లో, వరి 6250, కంది 165 ,పెసర 470, మినుము 60, మిర్చి 2300 ఎకరాల్లో పంటలు సాగు చేయవలసి ఉంది. మే నెలలోనే అన్నదాతలు దాదాపు పొలాలు అన్నింటిని విత్తనాల సాగుకు సిద్ధం చేశారు. కొన్ని గ్రామాలలో మాత్రం పొలాలను దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచి జూన్ మొదటి వారంలో వర్షాలు పడగానే పత్తి విత్తనాలను నాటారు. తూటికుంట్ల, లక్ష్మీపురం, గోవిందాపురం ఎల్, బ్రాహ్మణపల్లి, రామాపురం, గార్లపాడు, రావినూతల, మోటమర్రి, రాయన్నపేట, ఆళ్లపాడు గ్రామాలలో రైతులు పత్తి విత్తనాలను నాటారు. ఈ గ్రామాలలో సాగుచేసిన పత్తి పొలాలు ఆశాజనకంగానే ఉన్నాయి. మండల వ్యాప్తంగా నేటికీ 8580 ఎకరాలలో మాత్రమే అన్నదాతలు పత్తి పంట సాగు చేశారు. పెసర 280 ఎకరాలలో మాత్రమే సాగు చేశారు. కంది, మినుము, మిర్చి, వరిలను కనీసం ఒక్క ఎకరం లో కూడా నేటి వరకు అన్నదాతలు సాగు చేయలేదు. పంటల సాగులో గత ఏడాది వానాకాలం చేసిన కన్నా ఈ సీజన్లో ఇప్పటివరకు సాగు శాతం చాలా తక్కువగా నమోదయింది. ఆరంభంలో వర్షాలు కురిసి ఆ తరువాత కొన్ని రోజులు లేకపోవడంతో రైతులు కొంత ఆందోళనకు గురయ్యారు. మండలంలో జూన్ చివరి నాటికి సుమారు 80 శాతం అన్ని రకాల పంటలు అన్నదాతలు సాగు చేయడం పూర్తయ్యేది. కానీ ప్రస్తుతం పది శాతం పంటలు కూడా సాగు కాలేదు. వర్షాలు వస్తున్నప్పటికీ అవి సకాలంలో రాకపోవడంతో అన్నదాతలు పంటలను సరైన సమయంలో సాగు చేయలేకపోతున్నారు. మండలంలోని అనేక గ్రామాలలో పొలాలన్నింటిని సాగుకు సిద్ధం చేసి ఉంచారు. కొన్ని గ్రామాలలో మాత్రం పొలాలను ఇంకా సాగుకు సిద్ధం చేయలేదు. మరి కొన్ని గ్రామాలలో ఇప్పటికే పత్తి పంటను సాగు చేయగా చాలా వరకు పత్తి పంట ఆశాజనకంగానే ఉంది. మరి కొన్ని గ్రామాలలో నాటిన పత్తి విత్తనాలు ఇంకా మొలకెత్తలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి ప్రతిరోజు తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ అవి పంటకు ఉపయోగపడే విధంగా లేకపోవడంతో అన్నదాతలు వర్షాల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.