Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఇండ్ల స్థలాలు క్రమబద్ధీకరణలో పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయమా.. 20వ డివిజన్లో పదిహేనేండ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు నోటీసులు ఇవ్వకుండా యుద్ధ ప్రాతిపదికన ఇండ్లు కూల్చివేత తగదని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. చెరుకు సుధాకర్, తెలంగాణ జనవేదిక జిల్లా అధ్యక్షులు కోయిని వెంకన్న, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డా. కేవీ కష్ణారావు పేర్కొన్నారు. నిరుపేదలకు జరిగిన అన్యాయంపై మానవహక్కుల కమిషన్, లోకాయుక్తకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఖమ్మంలోని 20వ డివిజన్ పరిధిలోని మమత ఆస్పత్రి, హార్వెస్టు స్కూలు ప్రాంతాల్లోని పేదల ఇండ్లను అధికారులు కూల్చివేసిన ఘటనకు నిరసనగా ఆదివారం
ఖమ్మం నగరంలో తెలంగాణ జనవేదిక ప్రతినిధుల ఆధ్వర్యంలో బాధితులతో నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. మొదటిగా పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ జనవేదిక కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ వైరారోడ్డు, కలెకరేట్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకూ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన నాయకులు అనంతరం తెలంగాణ జనవేదిక ఉపాధ్యక్షులు, లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ భద్రూనాయక్ అధ్యక్షతన నిరసన సభ జరిగింది.
ఈ సందర్భంగా డా. చెరుకు సుధాకర్, కోయిన్ని వెంకన్న, బానోత్ భద్రూనాయక్, డా. కేవీ కృష్ణారావు మాట్లాడుతూ గత నెల 25, 26 తేదీల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున పోలీసులను మొహరించి, పేదలను భయభ్రాంతులకు గురిచేసి, పేదల ఇండ్లు కూల్చివేయడం దారుణమన్నారు. పేదల ఇండ్లు కూల్చి పెద్దలకు కట్టబెట్టేందుకే కొందరు ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇటీవలే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీచేశామని వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనవేదిక కార్యదర్శి ఎం. రామకృష్ణ, సభ్యులు మందాబుచ్చిబాబు, అఖిల్, ఎం. రాజు పాల్గన్నారు.