Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
సెప్టెంబర్ 2016 సంవత్సరంలో డెంగ్యూ వ్యాధి ప్రారంభమై బోనకల్ మండలాన్ని గడగడలాడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా బోనకల్ మండలంలోని డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలింది. మండలంలో ఉన్న 22 గ్రామాలలో డెంగ్యూ వ్యాధి వ్యాపించింది. ప్రతి ఇంటిలోనూ డెంగ్యూ వ్యాధి వ్యాపించింది. మండల వ్యాప్తంగా 22 మంది డెంగ్యూ వ్యాధితో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా రావినూతల గ్రామంలో డెంగ్యూ వ్యాధితో మృతి చెందారు. ఈ గ్రామంలో వైద్యం కోసం సుమారు కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేశారు. ఈ సమయంలో మండల వైద్యాధికారిగా బోడ బాలాజీ విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కేవలం బోనకల్లు మండలంలోనే డెంగ్యూ వ్యాధి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర వైద్య శాఖ నుంచి కూడా ప్రత్యేక బృందం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని రోజుల పాటు తిష్ట వేసింది. చివరకు వ్యాధి తీవ్రత దృష్ట్యా ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె లక్ష్మారెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 1 నవంబర్ 2016న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. బోడ బాలాజీ వైద్య సేవల గురించి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు వారికి వివరించారు. దీంతో వారు బాలాజీని ప్రశంసలతో ముంచెత్తారు. బాలాజీ రాత్రి పగలు లేకుండా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ఉంటూ డెంగ్యూ వ్యాధి నివారణలో, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎనలేని కృషి చేశారు. వందల మందికి డెంగ్యూ వ్యాధి సోకటంతో ఉన్నత అధికారుల అనుమతితో ఆయా గ్రామాల్లోనే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందితో కలిసి వైద్య సేవలు అందించి జిల్లా, రాష్ట్ర అధికారులు, మంత్రులు ఎమ్మెల్యేలచే శభాష్ అనిపించుకున్నారు. ఈ సేవలకు గాను మరుసటి సంవత్సరం బాలాజీ ఒక్కరినే జిల్లా ఉత్తమ వైద్యుడు అవార్డుతో నాటి కలెక్టర్ లోకేష్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్కరించారు. ఆ విధంగా బాలాజీ డెంగ్యూ వ్యాధి నివారణ విశేషమైన కృషి చేవారు.
నేడు కరోనా వ్యాధి వైద్యసేవలలోనూ ప్రస్తుత మండల వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్ విశేషమైన సేవలు అందిస్తున్నారు. కరోనా మండలాన్ని అతలాకుతలం చేసింది. తాటికొండ శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నారు. ఆనాడు డెంగ్యూ ఇరవై రెండు గ్రామాలను నేడు కరోనా కూడా ఇరవై రెండు గ్రామాలను వణికిస్తుంది. ఈ సమయంలో శ్రీకాంత్ కరోనా కి భయపడకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తనతో పాటు వైద్య సిబ్బందిని కూడా కరోనా వ్యాధి నివారణ లో విశేషమైన కృషి చేశారు. కరోనా వ్యాధి వల్ల మండలంలో 44 మంది మృత్యువాత పడ్డారు. ఆయనా శ్రీకాంత్ వెనకడుగు వేయకుండా వైద్య సేవలలో తనదైన ముద్ర వేసుకున్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణకు, వైద్య సేవలకు గాను జిల్లాలో శ్రీకాంత్ ఉత్తమ మండల ప్రాథమిక వైద్యాధికారి గా ఎంపికై అవార్డులు పొందారు.
అదేవిధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాయకల్ప అవార్డుకు కూడా ఖమ్మం జిల్లా నుంచి శ్రీకాంత్ ఒక్కరే ఎంపికయ్యారు. ఈ విధంగా ఆనాడు బాలాజీ నేడు శ్రీకాంత్ మండల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మండల వైద్యాధికారులు ఎలా ఉండాలో చేసి చూపించి జిల్లా వైద్య రంగానికే ఆదర్శంగా నిలిచారు.