Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరా టౌన్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విప్లవాత్మక పోరాటమని, భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం తెలంగాణ ప్రజలు చేసిన సాయుధ పోరాటం ప్రపంచానికి ఎన్నో పోరాట స్వరూపాలను అందించిందని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అన్నారు. ఆదివారం వైరా సీపీఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 75వ వర్థంతి సభ జరిగింది. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి రైతు సంఘం సీనియర్ నాయకుడు నర్వనేని సత్యనారాయణ పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొంతు రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం దొడ్డి కొమురయ్య స్పూర్తితో ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు గడీలలో, పొలాలలో దశాబ్దాల పాటు వెట్టిచాకిరీ చేస్తూ శ్రమ దోపిడీకి గురయ్యారని, మహిళలపై అకృత్యాలు చేశారని, ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యంతో గ్రామీణ రైతులు, కూలీలు, కార్మికులు, సగటు ప్రజలు ఆనాటి నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, బోడపట్ల రవీందర్, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మెహన్ రావు, గుత్తా రాధాకృష్ణ పాల్గొన్నారు.