Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రి జిల్లా సమగ్ర శిక్ష పథకంలో 422 మంది కాంట్రాక్టు ఉద్యోగులు
- వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు
- లాక్డౌన్ సమయంలోనూ సేవలు
- ఆదుకోండి : టీఎస్‌యుటీఎఫ్, టీపీటీఎఫ్
- త్వరలో సమస్య పరిష్కారం : డీఈఓ సోమశేఖర శర్మ
నవతెలంగాణ-ఇల్లందు
జిల్లా అధికారుల నిర్లక్ష్యమో వారిపాలిట శాపమో కానీ భద్రాద్రి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 422 మంది కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పుణ్యకాలం గడిచినా వారిని పునర్నియామకం చేయకపోగా గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారంతా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వివరాల్లోకి వెలితె... విద్యాశాఖలో అత్యంత కీలకమైన విధులు నిర్వహించేది కాంట్రాక్టు ఉద్యోగులే. వీరిలో నాన్‌టీచింగ్ సిబ్బంది పనిచేస్తేనే జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి రాష్ట్ర విద్యాశాఖకు నివేధికలు అందుతాయి. బడిలోని పిల్లలు, బడిబయటి పిల్లలు, పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యహ్న భోజన బిల్లులు, తదితర అంశాలన్ని రాష్ట్ర విద్యాశాఖకు చేరవేయాలంటే వీరులేనిదే పనికాదు. ఇలాంటి అత్యంత కీలకమైన విధులు నిర్వహించేవారి పట్ల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 'సమగ్ర శిక్ష' పథకంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యాభోదన, భోదనేతర సిబ్బంది మొత్తం 422మంది పనిచేస్తున్నారు. జిల్లాలోని 14 కేజీబీవీల్లో 154 మంది విద్యాభోదన సిబ్బంది, నాన్‌టీచింగ్ విభాగంలో ఎంఐఎస్కో ఆర్డీనేటర్లు 14, కంప్యూటర్ ఆపరేటర్లు 14, ఊఈఆర్పీ (ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ 32, ఎంఆర్సిలోల మెసెంజర్లు 16మంది, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ 97మంది పనిచేస్తున్నారు. కరోనా భయంతో అనేక మంది ఉద్యోగులు ఇంటికే పరిమితమైనా ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు నిత్యం పనిచేస్తూనే ఉన్నారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ 16న తాత్కాలికంగా తొలగించి తిరిగి అదే నెల 24న పునర్నియామకం చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పునర్నియామకం చేయలేదు. వీరి నియామకంపై జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు అందకపోవడంతో వారి బతుకు అడకత్తెరలో పోకచెక్కలా నలుగూతోంది. ప్రతి ఏడాది రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల్లోనే ఏప్రిల్ 16న తొలగించి తిరిగి 20న పునర్నియామకం చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రతిని జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు సమర్పించినప్పటికి స్పష్టమైన నియామక ఆదేశాలు రాలేదని తెలిసింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తమను పునర్నియామకం చేసి వేతన బకాయిలు ఇప్పించాలని కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు.
ఆదుకోండి : టిఎస్‌యుటిఎఫ్, టిపిటిఎఫ్
జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పనిచేస్తున్న 422 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెన్యూవల్స్, వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణం సమస్య పరిష్కరించాలని టిపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి పొట్ట పింజర రాము, టిఎస్‌యుటిఎఫ్ మండల కార్యదర్శి పల్లి జయరాజులు కలెక్టర్, డిఇఓలను కోరారు.
త్వరలో సమస్య పరిష్కారం : డీఈఓ సోమశేఖర శర్మ
ఈ విషయమై డీఈఓ సోమశేఖర్ శర్మను వివరణ కోరగా కలెక్టర్ పదవి విరమణ కావడంతో కొంత ఆలస్యమైందని, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఫైల్‌ను పరిశీలించి ఆదేశాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఫైల్ కలెక్టరేట్లోనే ఉందని ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.