Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ని నిర్భందాలు సృష్టించినా సెంటు భూమి వదులుకోం
- 6,7 తేదీల్లో పోడు క్షేత్రాల సందర్శన
- 8న రెండు వేల మంది పోడు ప్రతినిధులతో కలెక్టరేట్ ధర్నా
- వామపక్షాల జిల్లా నేతలు హెచ్చరిక
నవతెలంగాణ-కొత్తగూడెం
పేద పోడు రైతాంగంపై ప్రభుత్వ దాడులు, నిర్భందాలు, పంటల విద్వంసాన్ని సహించబోమని, ఎన్ని నిర్భందాలెదురైనా సెంటు భూమిని పేదోడి నుంచి లాక్కోనివ్వబోమని వామపక్ష పార్టీల జిల్లా నేతలు పునరు ద్ఘాటించారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఆవునూరి మధు, ఎల్.విశ్వనాధం, మాచర్ల సత్యం మాట్లాడారు. అడవినే నమ్ముకొని అనాదిగా జీవనం సాగిస్తున్న గిరిజనులు, గిరిజనేతర పేదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవనం లేకుండా చేస్తోందన్నారని మండిపడ్డారు. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలో లక్షలాది మంది పేదలు, గిరిజనులు ఆరు దశాబ్దాలకు పైగా పోడు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ భూములకు హక్కు పత్రాలు అందించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. అనేక పోరాటాలతో సాధించుకున్న 2005 అటవీ హక్కుల పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.. పోడు సమస్యకు తానే స్వయంగా పరిష్కారం చూపుతానని, దళితులకు, పేదలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ హామీని అమలు చేయలేదన్నారు. హరితహారం పేరుతో పోడుసాగు దారుల భూములు లాక్కుని ఉపాధి లేకుండా చేస్తోందన్నారని ఆగ్రహం వ్యవక్తం చేశారు. పేదలపై ఫారెస్టు, పోలీసు, రెవిన్యూ శాఖలను ఉసి గొల్పుతున్న ప్రభుత్వంపై పోడు రైతులు తిరగబడాలని పిలుపు నిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సహనాన్ని పరీక్షిస్తోందని, ప్రభుత్వతీరు మార్చకోని పక్షంలో ప్రజా గ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పోడు క్షేత్రాల నుంచి ఫారెస్టు, పోలీసులను వెనక్కు పంపించకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. పోడు రైతులకు మేలు చేస్తామని టీఆర్ఎస్ చంకనెక్కిన ఎమ్మెల్యేలు పోడు రైతులను మోసం చేశారని, ఇలాంటి ఎమ్మెల్యేను పోడు రైతులు అడుగడుగునా నిలదీయాలని పిలుపు నిచ్చారు. పోడు సమస్య పరిష్కారం కోరుతూ ఈ నెల వామపక్షాల ఆద్వర్యంలో 6, 7 తేదీల్లో పోడు క్షేత్రాల సందర్శన, 8వ తేదీన 2వేల మంది పోడు ప్రతినిధులతో కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజె.రమేష్, గుగులోత్ ధర్మ, కొండపల్లి శ్రీధర్, భూక్య రమేష్, నల్లమల్ల సత్యనారాయణ, సందకూరి లక్ష్మి, నందిపాటి రమేష్, నాగేశ్వర్ రావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు వెంకటేశ్వర్లు, రామనాధం, వి.పూర్ణచందర్రావు, శ్రీను, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు పి.సతీష్, సురేందర్, డి.ప్రసాద్, డివిబి.చారి, హుక్ల తదితరులు పాల్గొన్నారు.