Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీేపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్
నవతెలంగాణ-భద్రాచలం
భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం దొడ్డి కొమరయ్య అని ఆయన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సీపీఐ(ఎం) కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏజె.రమేష్ మాట్లాడుతూ నాటి నైజాం పాలకులు సాగించిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, దొరల దోపిడీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని నేటి ప్రజలు పుణికిపుచ్చుకుని కుల, మత, ప్రాంతీయ విభజన వాదాలను తిప్పి కొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, ఎం.బీ.నరసారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు పాల్గొన్నారు.
గుండాల : భూమికోసం, భుక్తి కోసం, నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కామ్రేడ్ దొడ్డి కొమురయ్య వారసత్వాన్ని కొనసాగించే వాళ్ళే నిజమైన కమ్యూనిస్టులని ఎన్డీ జిల్లా నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి సందర్భంగా ఆదివారం గుండాల, కాచనపల్లి, ముత్తాపురం, కొడవటంచ గ్రామాలలో జరిగిన వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్)జిల్లా కార్యదర్శి పర్శిక రవి, న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్, వై.వెంకన్న, ఈసం కృష్ణన్న, రంగన్న, శేఖర్, లాజర్, రమేష్ పాల్గొన్నారు.
చండ్రుగొండ : ఎన్డీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల మండల కార్యదర్శి వరికూటి వెంకట్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పద్మ వెంకన్న, టి.వెంకటేశ్వర్లు, బాలు, కారం వెంకటేశ్వర్లు, ముత్యాలు తదితరలు పాల్గొన్నారు.