Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
దొడ్డి కొమరయ్య భూమికోసం భుక్తికోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ పోరాటంలో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మాదినేని రమేష్ అధ్యక్షతన ఖమ్మం మంచికంటి మీటింగ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. మూడు వేల గ్రామాల్లో 10 వేల ఎకరాల భూములను పంచిన చరిత్ర మూడు వేలమంది అమరులైన చరిత్ర వీర తెలంగాణ పోరాటంలో జరిగిందన్నారు. ఆ స్ఫూర్తితో అనేక పోరాటాలు జరిగి పేదలకు కొన్ని ప్రాంతాల్లో భూముల దక్కిన నేటికీ పట్టాలు ఇవ్వలేదన్నారు. రైతుబంధుకు నోచుకోవటం లేదని అర్హులందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. నేడు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక భూమి సమస్యలు పరిష్కారం చేయకుండా కులం మతం సమస్యలను ముందుకు తెస్తూ ప్రజలను విభజిస్తూ తన మత ఉన్మాదాన్ని ప్రజల మీద రుద్దు తుందని ఆయన విమర్శించారు. పేదలకు భూములు పంచకుండా కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు జమీందారులకు వందలు వేల ఎకరాలు కట్టబెడుతున్నారని భూమి.వి కేంద్రీకరణ జరగకుండా పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖ దళిత గిరిజనుల గ్రామీణ ఉపాధి పనిలో లో కుల విభజన కు తెచ్చిన జీవోను తక్షణం రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలుతు అమరవీరులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు పారుపల్లి ఝాన్సీ, రాజకీయ విద్యా విభాగం కన్వీనర్ బండారు రమేష్, సీఐటియు నాయకులు ఎం గోపాల్ పడిగెల నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, బోడేపూడి వీరభద్రం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ, గొర్రెల మేకల సంఘం జిల్లా కార్యదర్శి మేకల నాగేశ్వర్ రావు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పగడాల నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తీగల వెంకటేశ్వర్లు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఎం గణపతి తదితరులు పాల్గొన్నారు.