Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొద్ది పాటి వర్షానికి విగ్రహానికి వరద తాకిడి
- నీటమునిగిన బల్లకట్టు సీత, నార చీర ప్రదేశం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అలనాడు త్రేతాయుగంలో అరణ్యవాస సమయంలో మహాసాధ్వి సీతాదేవి పుట్టెడు కష్టాలు పడింది. కానీ ఆ సీతమ్మ తల్లి పాలకుల నిర్లక్ష్యంతో కలియుగంలో కూడా కష్టాలు అనుభవిస్తోంది. వర్షాకాలం వస్తే చాలు నీళ్లలో తేలాడుతున్న ఆ సీతమ్మ విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో.. సీతమ్మ అంటూ ముక్కున వేలు వేసుకుం టున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. సీతారామ లక్ష్మణ స్వాములు అరణ్యవాస సమయంలో ఇక్కడ మూడేళ్లపాటు ఉన్నారని పురాణాల బట్టి తెలుస్తోంది. ఆనాడు సీతాదేవి స్నానం ఆచరించడానికి తన మరిది లక్ష్మణస్వామి దగ్గర్లో ఉన్న లక్ష్మణ గుట్టకు బాణం వేశాడని దానికి చిల్లు పడిందని నీరు పారిన ప్రాంతాన్ని సీత వాగుగా పిలుస్తున్నారు. సీతమ్మ స్నానమాచరించిన ప్రదేశంలో ఆమె ఆర వేస్తున్న చీరల గుర్తులతో పాటు, పండ్లు ఫలహారాలు తిన్న రాతి గిన్నె ఆనవాలు, గోలీల ఆట ఆడిన వామన గుంటలు, రాములవారి రాతి సింహాసనం ఆయన రాతి పాదుకలు, ఉత్తరేణి అంటి అనవాలతో పాటు లక్ష్మణ స్వామి ముక్కు కోసిన శుర్ప నక్క చెట్టు వంటి ఆనవాళ్ళు సీతానార చీర ప్రాంతంలో ఉంటాయి. కాగా ఈ ప్రదేశం కొద్ది పాటి వర్షాలు వచ్చిన, గోదావరి వరదలు వచ్చిన నీట మునగాల్సిందే. సోమవారం ఉదయం మండలంతో పాటు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో కురిసిన ఓ మోస్తరు భారీ వర్షానికి... సీత వాగు వర్షపు నీటితో పొంగి పొరలింది. దీంతో సీతమ్మ నార చీరల ప్రదేశంతో పాటు, అక్కడ ఏర్పాటు చేసిన బల్లకట్టు, సీతాదేవి విగ్రహం వరద నీటిలో మునిగి తేలాడాయి. ఈ ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా దేవాదాయ శాఖ అధికారులు, పాలక ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తున్న భక్తులు పర్యాటకులు కోరుతున్నారు.