Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జల దోపిడీని, మొండి వైఖరిని అడ్డుకొని తీరతామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సోమవారం జరిగిన హరితహార ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. హరిత ట్రిబ్యునల్ స్టే ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఎడారి చేసేందుకు కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ఏవెక్స్ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణాలో నీటి పంపిణీ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలందరం మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సాగునీటికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిలో భాగంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నదిని భూగర్భంలో దాచి పెట్టే మహాయజ్ఞం లాంటి కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తిచేసి దాదాపు అన్ని జిల్లాలకు నీరందించి బీడు భూములను మాగాణి భూములుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఆనాడు పాలకుల వివక్షకు గురైతే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోటి రతనాల వీణ అనే విధంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ సారధ్యంలో మనందరం ఏపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సండ్ర ప్రజలకు పిలుపునిచ్చారు.