Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ని నిర్బంధాలు ఎదురైనా సెంటు భూమి వదలం
- అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవతెలంగాణ-ములకలపల్లి
అడవిపై గిరిజనులదే పూర్తి హక్కని, పోడుభూములను గుంజు కోవడం అప్రజాస్వామ్యమని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. గత 40 ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో పోడు సాగుదారులతో జరిగిన మహా ప్రదర్శన అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు అడవిపై హక్కు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, అటవీ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాగుదారులపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనులకు అండగా ఉన్న 1/70 చట్టాన్ని తుంగలో తొక్కి వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సాగుదారులకు అండగా సీపీఐ(ఎం) ఉంటుందని దాడులను తిప్పికొడతామని హెచ్చరించారు.
ఎంతటి నిర్బంధాన్నైనా ఎదురోని పోడు సాగుదరుల కు అండగా నిలబడి భూములు కాపాడుతామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. సాగుదారులపై అక్రమ దాడులు చేసిన అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని వడ్డు రామవరం, పూసుగూడెం, మాధారం, గంగారాం, కొబ్బరిపాడు, గుట్టగూడెం గ్రామాల్లో హక్కు పత్రాలు ఉన్నప్పటికీ ప్రతి ఏటా అటవీ శాఖ కవ్వింపులకు పాల్పడుతుందన్నారు. ధర్నా అనంతరం తహసీల్దార్ వీరభద్రంనకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, పీఏసీఎస్ డైరెక్టర్ ఊకంటి రవికుమార్, గౌరి నాగేశ్వరరావు, రావూజ, కుంజా రామమూర్తి, పోడియం వెంకటేశ్వర్లు, నిమ్మల మధు, లక్ష్మి నర్సయ్య, శ్రీరాములు, వీరస్వామి, తిరుపతయ్య పాల్గొన్నారు.