Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
చిరునోముల, నారాయణపురం గ్రామాలలో పల్లె ప్రగతి పనులు చాలా బాగున్నాయి అని, ఎప్పుడూ ఇలాగే ఉండాలని డిఆర్డిఓ పీడీ మెరుగు విద్యాచందన ఆ గ్రామాల సర్పంచులను, పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. మండల పరిధిలోని చిరునోముల, నారాయణపురం గ్రామాలలో నాలుగో విడత పల్లె ప్రగతి పనులను, 7వ విడత హరితహారం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిరునోముల గ్రామంలో బృహత్ ప్రకృతి వనం కోసం గిడ్డంగుల గోడౌన్ పక్కన గల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అయితే ఆ స్థలంలో రాళ్లు ఎక్కువగా ఉండటంతో బృహత్ ప్రకతి వనం కోసం ఆ స్థలంపై పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేయలేదు. ముత్యాలమ్మ గుడి వద్ద గల నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌ను, పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామ ప్రజలకు నర్సరీ వద్ద మొక్కలను పంపిణీ చేశారు. వాటినన్నింటినీ పరిశీలిస్తూ ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తూ సర్పంచ్ మూలకారపు రవి, పంచాయతీ కార్యదర్శి బంధం అర్జున్ను అభినందించారు. అనంతరం నారాయణపురంలోనే కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం ఏర్పాటుచేసిన స్థలాన్ని పరిశీలించారు. వైకుంఠదామాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రదేశంలో తీసుకున్న ప్రత్యేక చర్యల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రకృతి పనులు, ఏడో విడత హరితహారం పనులు వేగవంతంగా నిర్వహించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి పనుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించడానికి వీలులేదని, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మొత్తం ఈనెల 10వ తేదీ వరకు పల్లె ప్రకృతి పనులు, 7వ విడత హరితహారం పనులను పెండింగులో లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. మండల అధికారులు అందరూ ప్రతిరోజూ గ్రామాల పర్యటన చేసి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, ఈజిఎస్ ఏపిడి సిహెచ్ శ్రీనివాసరావు, ఆయా గ్రామాల సర్పంచులు ములకారపు రవి, సాధినేని చంద్ర కళావతి, పంచాయతీ కార్యదర్శులు బంధం అర్జున్, గుడికందుల ధనలక్ష్మి ఈజీఎస్ ఈ సి బెల్లంకొండ సతీష్, టెక్నికల్ అసిస్టెంట్ ఎం.నాగేశ్వరరావు రిటైర్డ్ ఉపాధ్యాయుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఆయా గ్రామాల పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.