Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదర్శంగా నిలుస్తున్న 'మన మోత్కూర్' వాట్సాప్ గ్రూప్
- విరాళాలు సేకరించి నిరుపేదలకు సాయం
నవతెలంగాణ-మోత్కూర్
ఆపదలో ఉన్న నిరుపేదలకు చేయి చేయి కలిపి తామున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మన వాట్సప్ గ్రూపు సభ్యులు. సోషల్ మీడియా అనగానే ఠక్కున గుర్తొచ్చేది వాట్సప్. వాట్సాప్ గ్రూపులో కేవలం వార్తలు సమాచారం, ఇతర వింతలు, విశేషాల వీడియోలు ఇలాంటివి షేర్ చేసుకోవడమే కాకుండా వాట్సప్ గ్రూపును వేదికగా చేసుకొని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన పలువురు యువకులు సుమారు ఆరేండ్ల క్రితం 'మన మోత్కూరు' వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. గ్రూపులో యువకులు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇలా 257 మంది సభ్యులు ఉన్నారు. గ్రూపులో అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నప్పటికీ రాజకీయ విమర్శలకు, వివాదాస్పద చర్చలకు పూర్తిగా దూరంగా ఉంటారు. గ్రూపు సభ్యులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా విరాళాలు సేకరిస్తూ సాయం అందిస్తున్నారు.
నిరుపేదలు, నిస్సహాయులకు అండగా...
నిరుపేదలు, నిస్సహాయులు ఎవరైనా సాయం కోసం అభ్యర్థించిన వెంటనే గ్రూప్ సభ్యులు స్పందిస్తూ తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.5 లక్షల వరకు విరాళాలు సేకరించి పలు సేవా కార్యక్రమాలకు ఖర్చు చేశారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన నిరుపేద యువకుడు కూరెళ్ల భాష పక్షవాతం వచ్చి మంచానికే పరిమితం కాగా అతనికి వైద్యం కోసం రూ. 55 వేలు అందించారు. కరోనాకు చికిత్స పొంది అప్పులపాలై ఆక్సిజన్ తో మంచానికే పరిమితమైన మున్సిపల్ పరిధిలోని కొండాపురానికి చెందిన మొలకల వెంకన్న కుటుంబానికి రూ. 40 వేలు, సుందరయ్య కాలనీలో నిరుపేద రావుల వెంకన్న కరోనాతో మతి చెందగా ఆ కుటుంబానికి రూ. 31 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మున్సిపల్ కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పోలీస్ స్టేషన్‌కు రూ. 56,500, రామాలయం నిర్మాణానికి రూ.40 వేలు అందించారు. మోత్కూర్‌కు చెందిన ఆది నర్సింహ కుమారుడు హైపటైటిస్-బి వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. నిరుపేద నాయీ బ్రాహ్మణుడు జూలూరు సైదులు మతి చెందగా అతని తల్లిదండ్రులకు రూ.23 వేలు, మాటూరి ప్రసాద్ కుటుంబానికి రూ. 33 వేలు, చిటూరి సందీప్ కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సాయం చేశారు. కరోనాలో సేవలందించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రూ.15 వేలతో స్వేట్టర్స్, కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ.5 వేలతో నిత్యావసరాల పంపిణీ, కరోనాతో మతి చెందిన నల్లమాస లింగయ్య కుటుంబానికి రూ. 5 వేలు అందించారు. కుర్రె సత్తయ్య కుటుంబానికి రూ.6 వేలు, జాన్ బీ కుటుంబానికి రూ.4500, లాక్ డౌన్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రూ.9వేలతో ఎన్-95 మాస్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ. 35 వేలతో షఉ, టై, బెల్టులు పంపిణీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రూ.18850లతో విద్యార్థులకు తాగునీరు అందించే వాటర్ ప్లాంట్ మరమ్మతు చేయించారు. గ్రూపు సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కూడా కూరెళ్ల భాష కు రూ.20 వేలు, రావుల వెంకన్నకు రూ.25 వేలు, మొలకల వెంకన్న కు రూ.20 వేలు అందజేశారు. ఇలా ఎన్నో రకాలుగా మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తున్నారు.
సేవా కార్యక్రమాలతో గుర్తింపు
గంధం శ్రీనివాసరావు, టీచర్, మోత్కూర్
వాట్సాప్ గ్రూపు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఎంతో గుర్తింపు లభిస్తుంది. దాతలు ఇచ్చిన వివరాలను పారదర్శకంగా ఖర్చు చేస్తుండడంతో గ్రూపు పై నమ్మకం పెరిగింది. పేదలకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేస్తున్నాం.
వాట్సప్ గ్రూపు సేవలు ప్రశంసనీయం
జి.ఉదరు కిరణ్, ఎస్ఐ, మోత్కూర్
నిరుపేదలకు మన మోత్కూరు వాట్సాప్ గ్రూపు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం.పోలీస్ స్టేషన్‌కు సీసీ కెమెరాలకు ఆర్థిక సాయం అందించాలని కోరిన వెంటనే గ్రూపు సభ్యులు రూ.56,500 అందించారు. సేవా కార్యక్రమాలను ఇలానే కొనసాగించి ఆదర్శంగా నిలవాలి.
అధికారులను భాగస్వాములను చేయడం అభినందనీయం
షెక్ మహమూద్, మున్సిపల్ కమిషనర్, మోత్కూర్
వాట్సాప్ గ్రూపు సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అధికారులను భాగస్వాములను చేయడం అభినందనీయం. మున్సిపాలిటీ పరంగా మా దష్టికి వచ్చిన పేదలను ఆదుకునేందుకు కషి చేస్తున్నాం.