Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛైర్మన్, కమిషనర్, ఎంపీడీఓ, ఎంపీఓ, పారిశుధ్య కార్మికుడికి అభినందనలు
- ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య నిర్వహిణ కౌన్సిలర్లదే
- శిథిలావస్ధలో ఉన్న భవనాలు తొలగించండి
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పట్టణ ప్రగతిని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. మండలంలోని రొంపేడు పంచాయతీ, మున్సిపాలిటీలోని 4 నుండి 7, 10, 11 వార్డులులో పారిశుధ్యం, పచ్చదనం, అవెన్యూ ప్లాంటేషన్, వ్యర్ధ పదార్దాల సేకరణ, మంచినీరు సరఫరా, విద్యుత్ తదితరాలు తనిఖీ చేశారు. రొంపేడు గ్రామ పంచాయతీలో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటుకు స్థలం సేకరణ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో మొదటి పల్లె ప్రకృతి వనం ఇక్కడే ఏర్పాటు చేసి శ్రీకారం చేడదామన్నారు. మొక్కల సేకరణ, దట్టమైన అడవి పెంచే ఏర్పాటు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలలో ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం సంతోషకరమని ఎంపీడీఓ అప్పారావు, ఎంపిఓ, అరుణ్గౌడ్, రొంపేడు సర్పంచ్ శంకర్,కార్యదర్శి నారాయణను ప్రత్యేకంగా అభినందించారు. వార్లుల్లో ప్రజలతో ముఖాముఖి నిర్వహించి సంతృప్తి వ్యక్తంచేశారు. శిథిలావస్ధలో ఉన్న భవనాలను తొలగించాలని యజమానులను ఆదేశించారు. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డిలను అభింనందించారు. పట్టణంలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతోందన్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. పాల్వంచ మున్సిపాలిటీని సందర్శించి అక్కడ వేసిన విధంగా పెయింటింగ్స్ వేయించాలని కమిషనర్‌ను ఆదేశించారు.
ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో చెట్టుకు సింహం బొమ్మను పరిశీలించారు. పెయింటింగ్ వేసిన పారిశుద్ద్య కార్మికుడు రాంచందర్‌ను అభినందించారు. అనంతరం గోవింద్ సెంటర్లో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణవేణి, ప్రత్యేక అధికారి మరియన్న, యంపిడిఓ అప్పారావు,ఎంపిఓ అరుణ్గౌడ్లు పాల్గొన్నారు.