Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్ర జల దోపిడీతో తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం
- బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ అభివృద్ధి కోసం రూ. 42 కోట్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. బుధవారం సత్తుపల్లి పట్టణ పరిధిలోని వేశ్యకాంతల చెరువుపై నిర్మించిన బ్రిడ్జీని ఇరిగేషన్ సీఈ శంకర్ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ గతంలో చిన్న, భారీ నీటిపారుదల ఎన్నెస్పీ విభాగాలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండేదని రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు మూడు శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తూ జలవనరులశాఖగా నామకరణం చేసి ప్రతి మండలానికి ఒక సబ్ డివిజన్ కార్యాలయం సత్తుపల్లి, మధిర రెండు నియోజకవర్గాలకు కలిపి పీవో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. నియోజకవర్గానికి కేటాయించిన రూ. 42 కోట్ల పనుల్లో వేశ్య కాంతల చెరువు అభివృద్ధి నిమిత్తం రూ. 4.75 కోట్లు కాగా రూ. 11.59 కోట్లతో తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో ఒక్కో చెక్ డ్యామ్ మంజూరు కాగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయన్నారు. అదే విధంగా రూ. 12.2 కోట్లతో వేంసూరులో 12 గ్రామాలకు సాంకేతిక అనుమతులు మంజూరు కాగా టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. మరో ప్యాకేజీలో రూ. 19 కోట్ల వ్యయంతో మొత్తం ఎనిమిది గ్రామాల పనులకు ప్రతిపాదనలు పూర్తయ్యే దశలో ఉన్నాయని పేర్కొన్నారు. రూ. 2.36 కోట్ల వ్యయంతో అత్యవసర ఇరిగేషన్ ప్రాజెక్టులు మరమ్మతులకు కూడా నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఆంధ్రా ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుపై జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను శరవేగంగా చేపడుతుందని ఈ జల దోపిడీతో తెలంగాణ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం చోద్యం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జల వనరులశాఖ ఈఈ ఆనంద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ సుజాత, వైస్ చైర్ పర్సన్ తోట సుజలా రాణి, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జెడ్పీటిసి కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్ కృష్ణయ్య, తుమ్మూరు సొసైటీ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, సత్తుపల్లి మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, కౌన్సిలర్ నరుకుళ్ల మమత శ్రీనివాస్, గ్రాండ్ మౌలాలి అధికారులు పాల్గొన్నారు.