Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళ్లర్పించిన సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ-కారేపల్లి
తమ కుటుంబానికి ఆధారమైన పోడు పోతుందేమోనని మనస్తాపంతో అనారోగ్యం పాలై వృద్ధురాలు పోతురాజు మహాలక్ష్మి(70) మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. పోతురాజు మహాలక్ష్మి కుటుంబం మూడు ఎకరాల పోడు భూమిని సాగుచేసుకుంటు జీవిస్తున్నారు. ఆ పోడు భూమిని మహాలక్ష్మి కుమారులు పోతురాజు చందర్రావు, పోతురాజు వెంకన్న, పోతురాజు రాంబాబులు సాగు చేయటానికి వెళ్ళిన ప్రతి సారి ఫారెస్టు అధికారులు అడ్డగించటం బెదిరించటం పనులు చేస్తున్నారు. దీంతో మహాలక్ష్మి మనోవేదన పడేది. తన వారసత్వంగా కుమారులకు ఇచ్చిన పోడు దక్కకుండా పోతుందని నిత్యమదనపడుతూ అనారోగ్యంకు గురైంది. ఈక్రమంలో పరిస్ధితి విషమించి మహాలక్ష్మి మృతి చెందింది. మృతి వార్త తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రంనాయక్, కారేపల్లి మండల కార్యదర్శి కే.నరేంద్రలు మహాలక్ష్మి మృతదేహాన్ని సందర్శించి నివాళ్లు ఆర్పించారు. జీవించే హక్కును ప్రభుత్వం హరిస్తుందని విమర్శించారు. తాతముత్తాతల కాలం నుండి పోడు సాగు చేసుకుంటున్న పేదలపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాష్టికంగా వ్యవహరిస్తుందన్నారు. పోడుపై కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నేటికి అమలు కాలేదన్నారు. పోడు రక్షణకు పోరాడుదామని, మనోవేదన చెందాల్సిన అవనసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏన్కూర్ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, కారేపల్లి మండల నాయకులు మద్దెల నాగయ్య, మాలోత్ రాంకోటి, వల్లబోయిన కొండలరావు, ఈసం రమేష్, మోకాళ్ల రజిత, ఎరిపోతు భద్రయ్య, మన్నెం బ్రహ్మయ్య, శేరు వెంకటేశ్వర్లు, శేరు లలితమ్మ, సురభి సుగుణ, చిలకా పార్వతి, కొండ వెంకటేశ్వర్లు, సురభి నరేష్, చాదరాసుపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.