Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో పెద్దమండవ గ్రామంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ సిపిఎం పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ తాసిల్దార్ కరుణాకర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు టీఎస్ కళ్యాణ్ మాట్లాడుతూ పెద్దమండవ గ్రామంలో 2009లో సర్వే నంబర్ 4, 76, 77లో ఉన్న ప్రభుత్వ భూమిని 120 మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 70 మందికి పట్టాలు ఇచ్చి 20 మందికి పట్టాలు ఇవ్వకుండా స్థలాన్ని చూపించారన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఆ పేదలకు ఇంటి స్థలాలు దక్కకపోగా గ్రామంలోని ఆ ప్రభుత్వ భూమిని ప్రస్తుతం అధికార పార్టీ అండతో గ్రామంలోని భూమి పక్కనున్న వారు అక్రమించికొని దర్జాగా అనుభవిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమానికి గురైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆక్రమణదారులను ఖాళీ చేయించి వెంటనే పేదల ఇంటిస్థలాలకు ఆ భూమిని పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమానికి గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డిటి కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పెద్దమండవ గ్రామ కార్యదర్శి కందిమల్ల తిరుపతి, నాయకులు మాసారపు సత్యనారాయణ, గుత్తికొండ మంగయ్య, మాసారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.