Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి
- ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలి
- కలెక్టర్ ఆర్వీ కర్ణన్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత ఆయా శాఖలదేనని కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో 'ప్రభుత్వ భూముల పరిరక్షణ- ఆక్రమణల తొలగింపు'' చర్యలపై శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో నీటిపారుదలశాఖ, మెయిన్ కెనాల్స్, ఫీడర్ కెనాల్స్ భూములు ఆక్రమణకు గురికాకుండా సంబంధిత శాఖల అధికారులే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ బృందం ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ భూములు, కట్టడాలకు నష్టం కలిగిస్తే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై ఆయా శాఖల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే ముందుగా ఆ శాఖల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఇరిగేషన్, దేవాదాయ, వక్ఫ్ స్థలాలను అధికారులు క్షేత్రస్థా యిలో తనిఖీలు చేపట్టాలన్నారు. అన్యాక్రాంతమైన భూములను గుర్తించాలన్నారు. టాస్క్ఫోర్స్, పోలీసు సహకారంతో గుర్తించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆర్అండ్బి రోడ్ల పక్కన ఆక్రమణల తొలగింపుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. వక్ఫ్ స్థలాల ఆక్రమణలను తొలగించి, నివేదిక సమర్పిం చాలన్నారు. సర్వే ప్రతిపాదికన ఆక్రమణలకు గురైన స్థలాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ భూముల సంరక్షణకు సంబంధిత శాఖ బాధ్యులు సమస్యను ముందస్తుగానే గుర్తించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుం టామని, అప్పటికే సమస్య పరిష్కారం కానియెడల ముందస్తుగానే పోలీసు శాఖకు సమాచారం అందించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణకు ఆయా శాఖల సమన్వయంతో పోలీసు శాఖ తుది చర్యలు తీసుకుంటుందని పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్ అన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్, ఏసిపి స్నేహమెహరా, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు రాము, ప్రభుత్వ ప్లీడర్ డి.కృష్ణారావు, ఇరిగేషన్ శాఖాధికారి ఆనందరావు, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్, జివి చంద్రమౌళి, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఆర్డిఓ రవీంద్రనాథ్, ఎన్ఎస్పి, దేవాదాయ, వక్ఫ్ బోర్డు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.