Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిమినల్ కేసులు నమోదు చేయండి
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు, జరిమాన విధించాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవిన్యూ అధికారులతో గోదావరి వరదలు, ధరణి, బృహాత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుకు స్థలం గుర్తింపు, ప్రభుత్వ భూములు పరిరక్షణకు ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు, ఇసుక, మట్టి అక్రమ రవాణ నియంత్రణ చర్యలు, కోర్టు కేసులు, మీ-సేవా, చౌకదుకాణాలు, మిల్లులు, బంకులు తనిఖీలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రెండు పడక గదులు అటవీ రెవిన్యూ భూములు రీ కన్సలేషన్, ఇంటిస్థలాలు క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకు అధికారులు అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమంగా ఇసుక, మట్టి రవాణాపై పటిష్ట పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. సీసీ టీవిలు ఏర్పాటు ద్వారా అక్రమ రవాణా చేయు వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని, దందా జరగడానికి వీల్లేదని, నియంత్రణ చేయకపోతే తహసిల్దారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెంబరు లేని వాహనాలు ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న వాహనాలను గుర్తించి పెద్దఎత్తున జరిమాన విధించు విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక, మట్టి అక్రమ, భూ సమస్యలపై ప్రజల నుండి అధికసంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయని అక్రమార్కులపై ఉదాసీనంగా వ్యవహరించొద్దని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు మండలస్థాయిలో భూములు అవసరం ఉన్నందున ప్రతి మండలంలో ప్రభుత్వ భూములు గుర్తించి నిర్దేశిత నమూనాలో సర్వే నెంబరు, మ్యాపుతో సహా నివేదికలు అందచేయాలని చెప్పారు. భూ సమస్యలు పరిష్కారం కొరకు దరఖాస్తు చేయడానికి ప్రజలకు అవగాహన ఉండదని, అటువంటి వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. సర్వే నెంబర్ అన్సైన్కు సిఫారసు చేసేముందు క్షణ్ణంగా పరిశీలన చేయాలన్నారు.. మండలంలో బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు ద్వారా మియాకి తరహా చిట్టడవులను పెంచేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు 10 ఎకరాలు స్థలాన్ని గుర్తించి నివేదికలు అందచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆర్దిఓ స్వర్ణలత, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఏఓ గన్యా అన్ని మండలాల తహసిల్దారులు, డీటీలు తదితరులు పాల్గొన్నారు.