Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయండి
నవతెలంగాణ-ఖమ్మం
అగ్రిగోల్డ్ సంస్థలో డబ్బులను దాచుకుని నష్టపోయిన కస్టమర్లు ఏజెంట్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించి ఆదుకోవాలని ఖమ్మం జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఖమ్మం జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ సమావేశం ఖమ్మంలోని గిరి ప్రసాద్ భవనం నందు గుడిమెట్ల రజిత అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దయ్యాల రామ మల్లేశం మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థ వలన ఆర్థికంగా నష్టపోయిన కస్టమర్స్, ఏజెంట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులను చెల్లించాలని కోరుతూ చేస్తూ ఈనెల 19వ తారీఖున హైదరాబాదులోని
సీపీఐ కార్యాలయం నందు నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర అగ్రిగోల్డ్, కస్టమర్ ఏజెంట్ల రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు జరుగుతుందని కావునా అధిక సంఖ్యలో అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, భాగం హేమంతరావు, గిరి ప్రసాద్, సబీర్ పాష తదితరులు హాజరవుతారని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ కోశాధికారి మద్దిన రామారావు, వీరప్పయ్య, హేమా, పుష్పలత, రాజు, వెంకటేశ్వర్లు, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.