Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల కేంద్రంలో సీహెచ్సీ నిర్మించాలని ర్యాలీ ప్రదర్శన
నవతెలంగాణ-చర్ల
మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రసూతి ఆసుపత్రికి సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని, పోస్టుమార్టం నిర్వహణ మండల కేంద్రంలోనే జరపాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆదివారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సీపీఐ(ఎం) గాంధీ సెంటర్ శాఖ, కేవీపీఎస్ మండల కమిటీ, వ్యకాస, సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో దీక్ష దిగారు. ఈ దీక్ష రథసారథులుగా కేవీపీఎస్ మండల కార్యదర్శి మచ్చా రామారావు, వ్యకాస మండల అధ్యక్షుడు శ్యామల వెంకట్, గాంధీ సెంటర్ సీపీఐ(ఎం) శాఖ నాయకుడు బందెల చంటి, విజయ కాలనీ సీపీఐ(ఎం) శాఖ నాయకురాలు షారోని హుస్సేన్లు దీక్షల్లో కూర్చోన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ గతంలో మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆసుపత్రిని అధికారుల ప్రోద్బలంతో కొయ్యూరు ప్రాంతానికి తరిలించారన్నారు. చర్లలో ప్రాథమిక ఆసుపత్రి స్థానంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని కడతామని చెప్పిన అధికారులు ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం సరి కాదని అన్నాడు. ప్రాథమిక ఆసుపత్రి ఇక్కడి నుంచి తరలించిన నాటి నుంచి ఇప్పటి వరకు నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్ష చందంగా తయారయిందని ఆయన విమర్శించారు. తాలిపేరు ఇవతల ఉన్న 13 పంచాయతీలలో గల 61 గ్రామాలకు చెందిన సుమారు 25604 మంది నిరుపేద ప్రజల మండల కేంద్రంలో ఆసుపత్రి లేక ప్రభుత్వ వైద్యానికి దూరమవుతున్నారన్నారు. వీరందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ మైనారిటీ పేద ప్రజలే అన్నారు. ఇటీవల కాలంలోనే ఇక్కడ ఆసుపత్రి లేని కారణంగా అనేకమంది మరణించిన సంఘటనలుఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఒక డాక్టరు, ఒక ఏఎన్ఎం కూడా లేరని అన్నారు. డాక్టర్లు లేకుండా వైద్యం ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. అనేక మంది గర్భిణీలు ఇక్కడ డాక్టర్లు, నర్సులు లేనందున ఆస్పత్రికి వచ్చి వెనుతిరిగి పోతున్న పరిస్థితి ఉందన్నారు. మండల కేంద్రంలోని గతంలో మాదిరిగా పోస్టుమార్టం నిర్వాహణ జరిపించాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా మరణించినప్పుడు పోస్టుమార్టం నిర్వహించాలంటే యాభై మూడు కిలోమీటర్లు ఆ మృతదేహాన్ని తీసుకొని ప్రయాణం చేసి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తక్షణం మండల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల దృశ్య మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని నిర్వహించి సంబంధిత వైద్యం ప్రజలకు అందించాలన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కాకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి రిలే నిరాహార దీక్షలుతో పోరాటం ఆపకుండా ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం దీక్ష రథసారథులు సమస్య-పరిష్కారం అయ్యేంతవరకు ఈ దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ దీక్షల న్యాయమైన పోరాటన్ని విద్యార్థులు యువకులు ఉపాధ్యాయులు మేధావులు ప్రజా సంఘాలు సోదర మిత్ర రాజకీయ పార్టీలు అందరూ కలిసి చేయూతను అందించి జయప్రదం చేసి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు బొళ్ల వినోద్, అలవాల రాజమ్మ, కోటి ముత్యాలరావు, చింతూరు రజనీకాంత్, వ్యకాస ఉపాధ్యక్షురాలు పొడుపు గంటి సమ్మక్క, సీఐటీయూ ఆటో యూనియన్ నాయకులు పామర్ బాలాజీ, కేవీపీఎస్ నాయకులు పిల్లి రమేష్, ఫార్ముల సాంబశివరావు, వరలక్ష్మి పెద్ద ఎత్తున నాయకులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.