Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు భూ సమస్యలపై అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ ప్రజల విజ్ఞప్తులను స్వీకరించారు. తగు చర్యలకు సంబంధిత అధి కారులకు ఆదేశాలిచ్చారు. భూసమస్యలు, డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు, ఉపాధికల్పనా, కళ్యాణలక్ష్మి ఆర్థిక సహాయం , రైతుబంధు తదితర సమస్యలపై అర్జీదారులు తమ ఫిర్యాదులను సమర్పించారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన గడ్డం సీతయ్య సర్వేనెం. 169/2లో గల 0-25 గుంటల భూమికి ఓ.ఆర్.సి ఇప్పించాలని కోరారు. చింతకాని మండలం పందిళ్ళపల్లికి చెందిన వి.గోపినాథ్ సర్వేనెం. 301/సీ లో తన వారసత్వ భూమిని పాస్ బుక్ లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురానికి చెందిన కె. వెంకటరమణ సర్వేనెం. 342/అ1 లో గల తన భూమికి రైతుబంధు రావడం లేదని తెలిపారు. నేలకొండపల్లి వాసి తోళ్ళ వెంకన్న సర్వేనెం. 49/అ2 లోని భూమిని తాను 2017లో కొనుగోలు చేసినా ఇంతవరకూ పాస్ బుక్ రాలేదని వాపోయారు. సమర్పించిన అర్జీలను పరిశీలించి తగు చర్యలకు సంబంధిత తహశీల్దార్లకు అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఖమ్మం నిజాంపేటకు చెందిన షేక్ ఆయేషా, నెహ్రూనగర్ నివాసి సయ్యద్ హసీనా, సుందర్ టాకీస్ రోడ్ కు చెందిన ఎన్.నళిని, దారకానగర్ నివాసి పూజా వెంకటమ్మ తమకు డబుల్ బెడ్రూమ్ గృహాలు మంజూరు చేయాలని విన్నవించుకున్నారు. ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామ రైతులు తమకు రైతుబంధు జమ కాలేదని సమర్పించిన అర్జీని పరిశీలించి తదుపరి చర్య తీసుకోవాలని ముదిగొండ తహశీల్దారును, వ్యవసాయ శాఖాధికారులకు సూచించారు. ఖమ్మం నగరం జమ్మిబండ నివాసి పి. విజయలక్ష్మి తాను 12-06-2020 న వివాహం చేసుకున్నానని కళ్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు అందలేదన్నారు. దీనిపై ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారికి సూచించారు. మధిర మండలం సిరిపురానికి చెందిన కనకపూడి వెంకటేశ్వర్లు తనకు ఎస్సీ కార్పొరేషన్ నుండి రుణ సబ్సిడీ ఇప్పించాల్సిందిగా కోరారు. సుందర్యనగర్ కు చెందిన యం.నీల వెలుగుమట్లలో తొలగించిన ఇళ్లకు బదులుగా తనకు కేటాయించిన స్థలంలో ఇళ్లుకట్టుకునేందుకు ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారికి ఈ విషయమై సూచించారు. శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు ''గ్రీవెన్స్ డే''లో పాల్గొన్నారు.