Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
నేను చాలా ప్రమాదకరంగా ఉన్నా.. జాగ్రత్త.. నన్ను పట్టించుకోండి... లేదా మీ ప్రాణాలను తీస్తా అంటూ చిరునోముల బీబీసీ కాలువపై ఉన్న బ్రిడ్జి అధికారులను, ప్రజలను ప్రజలను హెచ్చరిస్తుంది. మండల పరిధిలోని బోనకల్ నుంచి చిరునోముల మీదుగా చొప్పకట్లపాలెం వరకు ఆర్అండ్బి రోడ్డు ఆరు కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రహదారి గుండానే ఆంధ్రాలోనే కృష్ణా జిల్లా పోలంపల్లి వరకు ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూడా వెళ్తుంది. చిరునోములలో 25 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగి కూడా ఉంది. అదేవిధంగా ఈ రహదారి నుంచే బోనకల్ నుంచి చొప్పకట్లపాలెం వరకు ప్రతిరోజు ప్రయాణికులతో ఆటోలు వెళ్తున్నాయి. చిరునోముల లో గల గిడ్డంగి వద్దకు లారీలు వస్తున్నాయి. గిడ్డంగి నుంచి వాణిజ్య పంటలను లోడ్ చేసుకొని భారీ బరువు లోడుతో లారీలు వెళుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన బోనకల్ - చొప్పకట్లపాలెం రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగే అనేకమంది అనేకమంది తీవ్ర గాయాలు పాలైన సంఘటనలు కోకొల్లలు. చిరునోముల బస్ షెల్టర్ నుంచి చిరునోముల వరకు రెండు కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు కిలోమీటర్ల రహదారి మొత్తం పెద్ద పెద్ద గుంతలతో భయంకరంగా ఉంది. ఆర్అండ్బి రోడ్డు అయినప్పటికీ కనీసం రెండు, మూడు మీటర్ల దూరం కూడా తార రోడ్డు కనిపించడం లేదంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందొ అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా చిరునోముల బస్సు షెల్టర్ నుంచి చిరునోముల మధ్య బిబిసి కాల్వపై 40 ఏళ్ల క్రితం బ్రిడ్జి నిర్మించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని అత్యంత ప్రమాదకరంగా మారింది. అనేకసార్లు జిల్లా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, మరికొంతమంది జిల్లాస్థాయి అధికారులు ఈ రహదారి గుండా వెళ్తూ బ్రిడ్జి పరిస్థితిని స్వయంగా చూశారు. అయినా అధికారులు గాని జిల్లా ప్రజా ప్రతినిధులు నుంచి ఏమాత్రం స్పందన కనిపించలేదు. బ్రిడ్జి మాత్రం ఎప్పుడు కూలిపోతుందో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి ఎన్ని ప్రాణాలు తీస్తుందో, అప్పుడైనా జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందిస్తారో వేచి చూద్దాం.