Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంట్లోకి చేరిన వర్షపు నీరు
- దోమలతో తీవ్ర అవస్థలు పడుతున్న బాధితులు
- చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ- నేలకొండపల్లి
ఆ గ్రామంలో అధికారపార్టీ నాయకుని అహంకారం, దౌర్జన్యం పరాకాష్టకు చేరింది. ఫలితంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం..... మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఖమ్మం కోదాడ ప్రధాన రహదారి పక్కన నూతన ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇంటి నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ ను ఇంటిలో పోసేందుకు సైడ్ ట్రైను పూడ్చి వేశాడు. దీంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు కిందకు వెళ్లకుండా పోటెత్తి ప్రక్కనే ఉన్న ఇళ్లలోకి చేరడంతో చెరువును తలపిస్తుంది. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు బాధితులు అధికార పార్టీ నాయకుని నిర్వాకంపై ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎంపీడీవో సైడ్ ట్రైన్ కు అడ్డుగా పోసిన గ్రావెల్ ను తొలగించాలని ఆదేశించారు. సోమవారం జెసిబితో సైడ్ ట్రైన్ కు అడ్డుగా పోసిన గ్రావెల్ ను తొలగిస్తుండగా అక్కడే ఉన్న అధికార పార్టీ నాయకుడు జెసిబి డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ నుండి వెళ్లిపోవాలని లేదంటే కేసు పెడతానంటూ బెదిరించినట్లు సమాచారం. గత మూడు రోజులుగా ఇంట్లో చేరిన వర్షపు నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న నీటి వల్ల దోమలు, ఈగలు చేరి పరిసరాలు కలుషితం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సైడ్ డ్రైన్‌పై అడ్డుగా పోసిన గ్రావెల్‌ను తొలగించాలని లేనియెడల ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయమై ఎంపీడీవోను వివరణ కోరగా నాలుగు రోజులుగా పల్లె ప్రగతి కార్యక్రమంలో బిజీగా ఉండటం వలన సమస్యను సకాలంలో పరిష్కరించలేక పోయామని అన్నారు. ఈ విషయంలో కొంత మంది రాజకీయం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏది ఏమైనా సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.