Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
- మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు
నవతెలంగాణ-చండ్రుగొండ
మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గార్లపాటి పవన్ కుమార్, బోడ అభి మిత్రులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల ఎదురుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెయింట్ జోసెఫ్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అధిక ఫీజులతో పాటు పాఠశాలలోనే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు తెలుపుతున్నారన్నారు. ఇదే విషయంపై మండల విద్యాశాఖ అధికారిని నవతెలంగాణ వివరణ కోరగా.. పాఠశాల యాజమాన్యం ఒకరోజు గడువు అడిగి నాలుగు రోజులు అవుతున్నా నేటికీ కూడా బిల్లులకు సంబంధించిన వివరాలను తెలియజేయలేదని ఇదే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు. అలాగే ఆ పాఠశాలపై చర్యలు తీసుకునే అర్హత తనకు లేదని కేవలం జిల్లా అధికారులకు మాత్రమే ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కలగజేసుకుని పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు రద్దు చేసి పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.