Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాగులవలే పొంగుతున్న లోతట్టు ప్రాంతాలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొతగూడెం
చిన్న జల్లులకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం అతలాకుతలమౌతుందని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉన్న పట్టణ, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ సమావేశంలో కనకయ్య మాట్లడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన కూడళ్లు, బస్తీలో, లోతట్టు ప్రాంతాలన్నీ చిన్న వర్షానికే మునిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, వ్యవస్థ అడ్డగోలుగా మారిందని తెలిపారు. ప్రణాళిక ప్రకారం పని చేయకపోవడం, విపత్తులు, వర్షాలు కురిసే సమయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావిడి చేయటం పరిపాటిగా మారుతుందని విమర్శించారు. ముందు జాగ్రతలు తీసుకోకపోవడం వల్ల ప్రతి వర్షానికి వాహన దారులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారనీ పేర్కొన్నారు. పేదలు, సామాన్యుల గోస వర్ణానాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించి ఒక పద్దతి ప్రకారం ఖర్చు పెట్టి రోడ్లు డ్రైనేజీ మరమ్మతులు చేపట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. బస్తీ వాసులకు, వాహన దారులకు, ఇండ్లల్లో నివాస ప్రాంతాల ప్రజలకు సమస్యలు రాకుండా చూడాలని అధికారులను కోరారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ప్రగల్భాలు పలికిన నేతలకు, అధికారులకు ప్రధాన సమస్యలు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పత్రికలలో, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాన్ని చేస్తూ హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు, జిల్లా కేంద్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్, జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, సందకురి లక్ష్మి, జునుమాల నగేష్,, ఎంఎస్.ప్రకాష్, జేబి.నాగరాజు, కర్ల వీరస్వామి, నందిపాటి రమేష్, ఆవుల శ్రీరాములు పాల్గొన్నారు.