Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మవ్వ్యూహాన్ని తలపిస్తున్న ట్రాఫిక్ రూల్సు
- రెండు నెలలుగా రింగ్‌సెంటర్ మూసివేత
- బస్టాండ్ ఇన్‌గేట్ ఎదురుగా నడిరోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు
- ఛలానాలతో వాహనదారుల జేబులకు చిల్లులు
- ఆంక్షలతో చిరువ్యాపారాలకు ఇక్కట్లు
- ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలంటున్న పట్టణ ప్రజలు
నవతెలంగాణ- సత్తుపల్లి
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సత్తుపల్లి పోలీసులు విధిస్తున్న ట్రాఫిక్ రూల్సు పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. గతంలో ఉన్నడూ లేని విధంగా విధించిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు వాహనదారులతో పాటు, ప్రజలు, వ్యాపారులకు, చిరువ్యాపారులకు ఆందోళనకరంగా మారాయి. ఫుట్‌పాత్‌లను ఆనుకొని గత 30-40 ఏండ్ల నుంచి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల జీవన స్థితిగతులను పోలీసులు కొత్తగా తీసుకొచ్చిన రూల్సు వారి పొట్టగొట్టే విధంగా మారాయి. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా రోడ్డుపక్కగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్న చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వన్‌వే ట్రాఫిక్ అంటూ కొన్నిచోట్ల ఏర్పాటు చేసిన బారికేడ్లు వాహనదారులకు తలనొప్పిగా మారాయి. నీ ముక్కు ఎక్కడంటే తలచుట్టూ తిప్పి చూపించిన విధంగా అదే వీధిలో నివాసముంటున్న వాహనదారులు వేరే వీధిగుండా వెళ్లాల్సిన పరిస్థితి ప్రస్తుతం సత్తుపల్లిలో నెలకొని ఉంది. గతంలో పాదచారులు రోడ్డు దాటాల్సి వస్తే ఒకపక్క చూసుకుంటూ దాటే పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పాలి. ఇద్దరుంటేనే ఒకరి చేయి ఒకరు పట్టుకొని చెరోవైపు చూసుకుంటూ దాటాల్సిన పరిస్థితి ప్రస్తుత ట్రాఫిక్ నిబంధనలను పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రాఫిక్ క్రమద్ధీకరణ పేరుతో పోలీసులు విధించిన రూల్సు పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా మారాయని పట్టణ ప్రజలను ఎవరిని అడిగినా ఇట్టే చెప్పగలరు.
రెండు నెలలుగా మూసిఉన్న
రింగు సెంటర్....
గత రెండు నెలలుగా బస్టాండ్ ప్రధాన కూడలి రింగు సెంటర్ మూసిఉంది. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ అదుపు తప్పడానికి రింగుసెంటర్ మూసివేతే కారణమని పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ట్రాఫిక్ సిగల్ లైట్లు పాడైపోవడంతో ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు రింగుసెంటరును మూసివేయడం జరిగిందని పోలీసులు అంటున్నారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో రింగ్సెంటర్ను కొన్ని నెలల పాటు మూసివేశారు. ఆ తరువాత మళ్లీ పునరుద్ధరించినా మళ్లీ మూసేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగల్ లైట్లు బాగైనప్పటికి రింగుసెంటర్ తెరవక పోవడం గమనార్హం. దీంతో భారీ వాహనాలు పట్టణంలో యూటర్న్ తీసుకునే ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచి పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి ప్రధాన కారణం రింగుసెంటర్ మూసివేతేనని ప్రజలు అంటున్నారు.
తాజాగా బస్టాండ్ ఇన్‌గేట్ ఎదురుగా నడిరోడ్డుపై బారికేడ్ల ఏర్పాటు....
తాజాగా (శనివారం) బస్టాండ్ ఇన్‌గేట్ ఎదురుగా నడిరోడ్డుపై బారికేడ్లు ఏర్పాటును పట్టణ ప్రజలు ముక్కున వేసేకుంటున్నారు. వాహన చోదకులు, బాటసారులు పోస్టాఫీస్ వైపు వాహన చోదకులు, బాటసారులకు ఈ బారికేడ్లు మరింతగా ఇబ్బందికరంగా మారాయని ఆ ప్రాంత ప్రజలు నొచ్చుకుం టున్నారు. ఇదిలా ఉంటే ఆ రోడ్డు పక్కన చిరువ్యాపారులకు పోలీసులు విధించే ఆంక్షలతో బెంబేలెత్తిపోతున్నారు.
ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలంటున్న పట్టణ ప్రజలు...
పోలీసులు ఇష్టారీతిన విధిస్తున్న ఆంక్షలపై స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జోక్యం చేసుకుంటేనే ట్రాఫిక్ ఆంక్షలపై వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. సత్తుపల్లిలో పార్కింగ్ లేని కారణంగా ఆయా దుకాణాలకు వెళ్లే వాహనదారులకు ఛలానాలు భయపెట్టేస్తున్నాయి. ఇప్పటి వరకు సత్తుపల్లిలో వివిధ రకాల వాహనదారుల నుంచి సుమారుగా రూ. 30లక్షల పైగానే వాహనదారుల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ప్రమాదాలను నివారించేందుకే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నాం : ఎ. రమాకాంత్, పట్టణ సీఐ
పట్టణంలో ప్రమాదాల నివారణకు మాత్రమే ట్రాఫిక్‌ను నియంత్రించడం జరుగుతోందని పట్టణ సీఐ ఎ.రమాకాంత్ తెలిపారు. సిగల్ టైట్లు బాగైనా రింగుసెంటరును ఎందుకు తెరవడం లేదనే 'నవతెలంగాణ' ప్రతినిధి అడుగ్గా సిగల్ లైట్లు బాగైనప్పటికి ట్రయల్స్‌లో ఉన్నాయన్నారు. కొత్తగా ఏర్పాటు చేసినవి కావుగా, దీనికి ట్రయల్స్ ఎందుకని ప్రశ్నించగా ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు.