Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
గత కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆనందంతో మంచి జోష్ మీద ఉన్నారు. జూన్ నెల ప్రారంభంలోనే నైరుతి రుతుపవనాలు అన్నదాతల్లో ఆశల నింపాయి. ఆరంభంలో కురిసిన వర్షాలతో పంటల సాగు దండిగా సాగుతుందన్న ఆశలలో అన్నదాతలు ఉన్నారు. పదిహేను రోజుల క్రితం వరకు సాగు చాలా మందకొడిగా సాగింది వారం రోజుల నుంచి విత్తనాల సాగు ఊపందుకుంది. భూములు చదును చేసుకోవడం, దుక్కులు దున్ని ఫలాలను సిద్ధంగా ఉంచుకోవడంతో వారం రోజుల నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో ముమ్మరంగా విత్తనాలను విత్తుతున్నారు. వారం రోజులుగా వర్షాలు రోజు పడుతుండటంతో రైతులు పంటల సాగుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మండల వ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలంలో పత్తి 19,900 ఎకరాల్లో, వరి 6,250 ఎకరాల్లో, కంది 165 ఎకరాల్లో ,పెసర 470 ఎకరాలలో, మినుము 60 ఎకరాలలో మిర్చి 2300 ఎకరాల్లో పంటలు సాగు చేయవలసి ఉంది. మే నెలలోనే అన్నదాతలు దాదాపు పొలాలు అన్నింటిని విత్తనాల సాగుకు సిద్ధం చేశారు. కొన్ని గ్రామాలలో మాత్రం పొలాలను దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచి జూన్ మొదటి వారంలో వర్షాలు పడగానే పత్తి విత్తనాలను నాటారు. మండల వ్యాప్తంగా నేటికీ 18,260 ఎకరాలలో మాత్రమే అన్నదాతలు పంటలను సాగు చేశారు. ఇందులో పత్తి 17,675 ఎకరాల్లో పెసర 442 ఎకరాలలో కంది 123 ఎకరాల్లో వరి 20 ఎకరాలలో సాగు చేశారు. మినుము, మిర్చి పంటలను కనీసం ఒక్క ఎకరంలో కూడా నేటి వరకు అన్నదాతలు సాగు చేయలేదు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఇంకా ఇరవై రెండు వందల ఎకరాల్లో మాత్రమే పత్తి పంటను సాగు చేయవలసి ఉంది. పంటల సాగులో గత ఏడాది వానాకాలం చేసిన కన్నా ఈ సీజన్లో ఇప్పటివరకు సాగు శాతం చాలా తక్కువగా నమోదయింది. ఆరంభంలో వర్షాలు కురిసి ఆ తరువాత కొన్ని రోజులు లేకపోవడంతో రైతులు కొంత ఆందోళనకు గురయ్యారు. మండలంలో జూలై నెలలో ఈ సమయానికి సుమారు 90 శాతం అన్ని రకాల పంటలు అన్నదాతలు సాగు చేయడం పూర్తయ్యేది. కానీ ప్రస్తుతం 60 శాతం పంటలు అన్నదాతలు సాగుచేశారు. మండలంలోని అనేక గ్రామాలలో ముందుగానే అన్నదాతలు పొలాలన్నింటిని సాగుకు సిద్ధం చేసి ఉంచారు. కొన్ని గ్రామాలలో మాత్రం పొలాలను ఇంకా సాగుకు సిద్ధం చేయలేదు. అనేక గ్రామాలలో ఇప్పటికే పత్తి పంటను సాగు చేయగా చాలా వరకు పంట ఆశాజనకంగానే ఉంది. మూడు నాలుగు రోజుల నుంచి చావు విత్తనాల స్థానంలో కొత్త విత్తనాలు నాటే పనిలో అన్నదాతలు నిమగమై ఉన్నారు. అదేవిధంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సాగు చేసిన పంటలు అన్ని ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఇదే పరిస్థితి చివరిదాకా ఉంటుందో లేదో నని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వర్షాల వల్ల అందరూ వ్యవసాయ పనులలోనే అన్నదాతలు నిమగమై ఉన్నారు.