Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలుకు నోచని కేసీఆర్ హామీలు
- పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కారేపల్లి
ప్రజలపై పడుతున్న భారాల పాపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే నని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శినున్నా నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం కారేపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంపు ఆశాస్త్రీయంగా జరుగుతుందన్నారు. కార్పోరేట్ సంస్ధలు ఇష్టం వచ్చినట్లు ప్రతి రోజు ఆయిల్ ధరలను పెంచుతున్నాయన్నారు. పన్నుల రూపేణా కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దోచుకుంటున్నాయన్నారు. ప్రభుత్వ సంస్ధలను అప్పనంగా కార్పొరేట్ శక్తులకు మోడీ కట్టబెడుతున్నాడన్నారు. ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న ఎల్ఐసీ ప్రయివేటీకరణకు రంగం సిద్దమైందన్నారు. విశాఖ ఉక్కును నేడో రేపో కార్పరేట్ శక్తులచేతిలోకి వెళ్ళనుందన్నారు. కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలతో రైతు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుందన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో రైతులు ఉద్యమిస్తున్నా కేసీఆర్ మాత్రం మోడీని ప్రశ్నించకపోవటం దేనికి నిదర్శనమన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కేసీఆర్ ఎస్సీ,ఎస్టీలకు ఇస్తున్న హామీలు ఏఒక్కటి అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇవ్వక పోగా కడుపు నింపుకోవటానికి పోడు చేసుకుంటుంటే వారిని భయాభ్రంతులకు గురుచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు తండాలు, గూడెంలకు వచ్చి పోడుకు హక్కు కల్పిస్తామన్నా మాటలు ఏమైనాయని ప్రశ్నించారు. హక్కులున్నా గిరిజనులను ఆంక్షల పేరుతో పంటలు పండకుండా ఫారెస్టు అడ్డుకుంటుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం పోరాటాలపైనే ఆధారపడి ఉందన్నారు. బాధితులను సంఘటితం చేయటం ద్వారా ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, కే.నాగేశ్వరరావు మండల కార్యదర్షి కే.నరేంద్ర, ఉసిరికాయలపల్లి సర్పంచ్ బానోత్ బన్సీలాల్, నాయకులు వజ్జా రామారావు, తలారి దేవప్రకాష్, కరపటి సీతారాములు, ముండ్ల ఏకాంబరం, మన్నెం బ్రహ్మయ్య, పాయం ఎర్రయ్య, పొడుగు పెంటయ్య తదితరులు ఉన్నారు.