Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడి వ్యవహార తీరుపై వెలువడుతున్న విమర్శలు
నవతెలంగాణ-భద్రాచలం
గత కొంత కాలంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం పట్టణంలోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందని తెలుస్తోంది. ప్రధానంగా ఒంటెద్దు పోకడలకు పోతున్న అధ్యక్షుడిపై కమిటీ సభ్యులందరూ అసహనానికి గురై అవిశ్వాసం పెట్టారు. ఆలయ మాజీ అధ్యక్షుడు దివంగత మాగంటి సూర్యం మరణాంతరం జరిగిన పరిణామాల్లో అధ్యక్ష పదవి చేపట్టిన కురిచేటి శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యుల పట్ల వ్యవహరించే తీరు, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల పట్ల కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న కోశాధికారి హరినాథ్ బాబు తనంతట తానే రాజీనామా చేసే విధంగా అధ్యక్షులు ఇబ్బందులకు గురిచేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక ఇటీవల కాలంలో కార్యదర్శితో కూడా వివాదం కల్పించుకొని సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు చేయడంమే కాక ఒక సందర్భంలో తన పలుకుబడితో కార్యదర్శిపై కేసు పెట్టి బెదిరించినట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవేకాక ప్రతి గురువారంతో పాటు ప్రత్యేక దినాలలో బాబా వారికి జరిగే పూజ ఇతర కార్యక్రమాలన్నీ కూడా తను వచ్చిన తర్వాత తన సమక్షంలో నిర్వహించాలని నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం పట్ల అనేక విమర్శలు వెలువడిన సందర్భాలున్నాయి. విసీ కమిటీని కూడా గౌరవించని అధ్యక్ష వ్యవహార శైలి పట్ల విసిగిన కమిటీ సభ్యులు శుక్రవారం ఏకతాటిపై వచ్చి కమిటీని రద్దు చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఆదివారం తిరిగి ఆలయ కమిటీ సమావేశమవుతారని సమాచారం.