Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించని మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎం.మంగమ్మపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక జెడ్పీటీసీ కొమరం హనుమంతు, ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ నెల 10న ఆళ్ళపల్లి గ్రామ పంచాయతీ ప్రకృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక వార్డు సభ్యులకు, ఉపసర్పంచ్, మండల ప్రజా ప్రతినిధులు జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఎటువంటి ఆహ్వానం, సమాచారం లేకుండా, కేవలం ఒక పార్టీకి చెందిన సర్పంచ్, ఎంపీటీసీలతో కార్యక్రమం నిర్వహిం చడంలో ఎంపీడీవో పక్షపాత ధోరణి అద్దం పడుతోందని ఆరోపించారు. మండలంలో నిధులు అంతంత మాత్రంగా ఉన్న చిన్న గ్రామ పంచాయ తీలలో పారిశుద్ధ్య నిర్వహణకు ఆటోట్రాలీ కొనే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఎంపీడీవో అనాలోచిత నిర్ణయాలతో బలవంతంగా వారిచే ట్రాక్టర్లు కొనుగోలు చేయించడంతో, ఇప్పుడు పంచాయతీ నిధులు ట్రాక్టర్ల కిస్తీలు కట్టడానికే సరిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
స్థానిక నర్సరీలో మొక్కలు ఉన్నప్పటికీ జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకే అంటూ.. గ్రామ పంచాయతీ నిధులు ఉన్నా లేకున్నా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఇష్టానుసారంగా అవసరానికి మించి మొక్కలు ఆయా సర్పంచ్లను బలవంతంగా కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడమేంటని ప్రశ్నించారు. మండలంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ గాలికి వదిలేసి, అధికారులను దుర్వినియోగం చేయడమే కాకుండా ఓ పార్టీ చేసిన కార్యక్రమాలకు పలుమార్లు అతిథిగా హాజరైన సందర్భాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఎంపీడీవో ఒంటెద్దు పోకడలపై గతంలో పలుమార్లు జిల్లా అధికారి సీఈవో విద్యాలత దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్లు పూనెం నిర్మల, గొగ్గెల ప్రేమకళ, కొమరం బాయమ్మ, నరసింహారావు, వెంకటనారాయణ, ఉపసర్పంచ్ బుర్ర వినోద, వార్డు సభ్యులు మొహమ్మద్ ఖయ్యుం, నరెడ్ల సరిత, తదితరులు పాల్గొన్నారు.