Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి
- తెలంగాణ రైతుసంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తలెత్తిన కృష్ణానది జలాల వివాదాన్ని ఆసరా చేసుకుని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అధ్యక్షతన శుక్రవారం 'కృష్ణా నది నీటి వినియోగం...పెండింగ్ ప్రాజెక్టులు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీలో తలెత్తిన వివాదాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. కృష్ణా జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యంతో మరింత ఇబ్బందులు ఏర్పడతాయి అని తెలిపారు. రాజకీయ ఆధిపత్యం కోసం కాకుండా శాస్త్రీయ కోణంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరపాలని కోరారు. 1976 సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలపై ఏర్పడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య కూడా నీటి పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాకాకుండా సంవత్సర కాలం గడపటం వల్ల వివాదం పెరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల పంపిణీలో తలెత్తిన సమస్య ఖమ్మం జిల్లాలో ఉన్న సాగర్ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శేఖర్ గౌడ్, టిజేఎస్ జిల్లా కార్యదర్శి వర్థబోయిన బాబు ప్రసంగించారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, ఎస్కె మీరా, తుమ్మల శ్రీనివాసరావు, ఆవుల వెంకటేశ్వర్లు ,బండారు రమేష్, మేకల నాగేశ్వరరావు, పి.సంగయ్య, మధు, రాయల శ్రీనివాస్‌రావు, ప్రతాపనేని వెంకటేశ్వరావు, పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు