Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట కార్మికుల ఆందోళన
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ 100 మంది కార్మికులకు 15 నెలలుగా జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల వైఖరికి నిరసనగా కార్మికులందరూ సిఐటియు, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జి. రామయ్య మాట్లాడుతూ గత కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 100 మంది కార్మికులను విధుల్లోకి తీసుకుని వారికి పదిహేను నెలలుగా జీతాలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో కార్మికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి తీవ్రంగా కష్టపడి పని చేశారని, కార్మికులను గుర్తించడంలో ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఒక నెల జీతం రాకపోతే అతలాకుతలం అవుతున్న సమయంలో 15 నెలలుగా జీతాలు ఇవ్వకుండా పస్తులతో పని చేయించుకుంటున్నారని వారు పేర్కొన్నారు. వీరికి జీతాలు చెల్లించాలని గత సంవత్సర కాలంగా కార్మిక సంఘాలు రాష్ట్ర ఉన్నతాధికారులకు, జిల్లా ఉన్నతాధికారులందరికీ సమస్యలు తీసుకెళ్లామని తెలిపారు. సమస్యను పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చిన అధికారులు నేటి వరకు సమస్యను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు తెలిపారు.. వెంటనే జిల్లా అధికారులు కార్మికుల సమస్యలపై జోక్యం చేసుకొని కార్మికులకు న్యాయం చేయాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీతాలు ఇస్తామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పి.రమ్య, ఏ.రామారావు, కే.వెంకన్న, మురళి, విజయమ్మ, వెంకటరమణ, కమల రాధా, మమత, కళ్యాణి, అశోక్, సత్యవతి, అంజలి తదితరులు పాల్గొన్నారు.