Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరిన ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావునగర్ ప్రాంతంలో ఉన్న 35 ఎకరాల భూమి అటవీ కార్పొరేషన్, అటవీ టింబర్ డిపో ఆధీనంలో ఉందని, ఈ స్థలాన్ని సత్తుపల్లి పట్టణంలో ఇండ్లులేని పేదల ఇండ్ల స్థలాలకు కేటాయించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీఎం కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిసి పేదల ఇండ్ల స్థలాల విషయమై వివరించి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. ఇండ్ల స్థలాల సమస్య జఠిలంగా మారిందని, తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సండ్ర కోరడంతో స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే స్పెషల్ ఫారెస్ట్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారికి ఫోన్ చేసి కార్పొరేషన్ కు కేటాయించిన భూమిని పేదల ఇండ్ల స్థలాలకు అనువుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావునగర్, ఎన్టీఆర్ నగర్, విరాట్ నగర్, మండల పరిధిలోని కిష్టారం గ్రామ శివారులో నివసిస్తున్న వారి ఇండ్ల పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థకు చేరాయని, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాల్సిందిగా కోరారు. గురువారం శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకన్న ప్రసాదాన్ని కేసీఆర్ కు అందజేశారు. ఎమ్మెల్యే వెంట సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ ఉన్నారు.