Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేళ్లుగా ఏఈ పోస్టు ఖాళీ
నవతెలంగాణ-బోనకల్
బోనకల్లు మండల విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. మూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఏఈ లేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 22 గ్రామ పంచాయతీలు, మూడు విద్యుత్ సబ్ స్టేషన్లో ఉన్నాయి. విద్యుత్ శాఖలో మూడు సంవత్సరాల నుండి మధిర ఇంచార్జి తోనే నెట్టుకు వస్తున్నారు. మధ్యలో ఏఈగా సతీష్ నియమితులయ్యారు. ఆయన కేవలం మూడు నెలల మాత్రమే విధులు నిర్వహించారు. అనంతరం ప్రమోషన్ రావడంతో ఆయన ఇతర ప్రాంతానికి బదిలీ అయ్యారు. బోనకల్ మండలం ఎ.ఈతో పాటు రావినూతల గ్రామంలో లైన్మెన్, బ్రాహ్మణపల్లి గ్రామంలో ఏఎల్ఎమ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 43 వేల జనాభా గల మండలంలో రెగ్యులర్ ఏఈ లేకపోవడం వల్ల మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ప్రధానంగా వర్షాకాలం సమయంలో విద్యుత్ సమస్య ఏర్పడుతుంది ఈ సమయంలో ఏదైనా విద్యుత్ సమస్య వస్తే త్వరితగతిన పరిష్కరం చేయలేకపతున్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల గ్రామాలలో విద్యుత్ స్తంభాలు పడిపోయినప్పుడు వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయటం లాంటి పనులు ఆలస్యం అవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. మండలంలో రావినూతల, సీతానగరం, మోటమర్రి గ్రామాలలో విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉన్నప్పటికీ విద్యుత్తు సమస్య తరస్సు ఏర్పడుతుంది. దీని వల్ల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా ఏఈ లేకపోవటం వల్ల అనేక సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. గ్రామాలలో రైతులు నూతనంగా విద్యుత్ లైన్ వేసుకునేందుకు డీడీలు చెల్లించి సంవత్సరాలు అవుతున్నా వాటి గురించి పట్టించుకునే నాథడే కరువయ్యాడు. సంవత్సరాల తరబడి రైతులు రోజు విద్యుత్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బోనకల్ మండలానికి రెగ్యులర్ ఏఈని, మండలంలో ఖాళీగా ఉన్న ఇతర పోస్టులకు సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.