Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్నెర్రజేసిన పంచాయతీ సర్పంచులు
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్కు పాలక సభ్యుల తీర్మానం లేకుండా ఎంపీఓ బట్టలు కొనుగోలు చేయడం గ్రామపంచాయతీ సభ్యులను అగౌరవ పరిచినట్టేనని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 36 గ్రామపంచాయతీలో 110 మంది మల్టీపర్పస్ వర్కర్స్ పని చేస్తున్నారు. వర్కర్స్ సంఘం అధ్యక్షుడు ఇటీవల తమకు డ్రెస్ కోడ్ కావాలని, అందుకు నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీఓకు వినతి పత్రం అందజేసిన విషయము తెలిసిందే. గ్రామపంచాయతీ కార్మికులకు డ్రస్సులు కొనాలంటే ఆ గ్రామపంచాయతీ నుండి తీర్మానం చేసి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ నిబంధనలు పాటించకుండా అత్యుత్సాహంతో ముందుగానే జిల్లాలోని భద్రాచలం, శ్రీ సాయి శ్రీనివాస టెక్సటైల్స్ షాప్‌లో 85 మందికి సంబంధించి ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున పాయింటు, షర్టుకు సంబంధించి క్లాత్‌ను ఎంపీఓ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన క్లాత్‌ను మండలానికి చెందిన ముగ్గురు మల్టీపర్పస్ వర్కర్స్లను భద్రాచలం పిలిపించి ఆ బట్టలను ఆటోలో టేకులపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్‌కు చేరవేశారు. ఇటీవల హరితహారంలో భాగంగా కొనుగోలు చేసిన మొక్కల్లో అవినీతి జరిగిందని ఎంపీవోపై స్థానిక ఎంపీపీ ఆధ్వర్యంలో పలు గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచులు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. కలెక్టర్‌ను కలిసిన మరుసటి రోజే టేకులపల్లి గ్రామపంచాయతీలో నిల్వ చేసిన బట్టలను గ్రామ పంచాయతీకి చెందిన ఒకరి ఇంటికి తీసుకెళ్లి నిలువ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. తీర్మానం లేకుండా కొనుగోలు చేసి ఎవరికి అన్యాయం చేస్తారని పలు గ్రామ పంచాయతీల సర్పంచులు కన్నెర్రజేసిన సంఘటనలు కనబడుతున్నాయి. మల్టీపర్పస్ వర్కర్స్లకు డ్రెస్ కోడ్ అవసరమే, కానీ జనరల్ పండ్ నుండి కొంత సొమ్మును పాలక సభ్యుల తీర్మానంతో డ్రా చేసి అనంతరం కొనుగోలు చేయాలి. నిబంధనలు పాటించకుండా ఎంపీఓ క్లాత్ కొనుగోలు చేయడం అన్యాయం అంటున్నారు. హరిత హారంలో మొక్కలు కొనుగోలు చేసిన డబ్బుకు సంబంధించిన చెక్కులకు నేటి వరకు సర్పంచులు సంతకాలు పెట్టలేదు. మండల అధికారుల పనితీరుతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీల సర్పంచులు ఎడమొహం, పెడమొహంతో ఉంటున్నారు. మండలంలోని 36 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు కుంటుపడతాయి. సంబంధిత అధికారులను సమన్వయ పరిచి గ్రామ పంచాయతీలను మెరుగుపర్చాలని జిల్లా అధికారులను పలు గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు కోరుతున్నారు. లేనియెడల గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కుంటుపడిందని సర్పంచులు వాపోతున్నారు.