Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ళపల్లి మండలం తునికిబండల గ్రామంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఈసం దూలయ్య (42) అనే నిరుపేద రైతుకు భార్య చంద్రకళ (35), కూతురు శ్రీలేఖ (14), కొడుకు ఆశిష్ తేజ (11) ఉన్నారు.
దూలయ్యకు గత నెల జూన్ 5వ తేదీన ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హౌం ఐసోలేషన్‌గా ఉంటూ కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన దూలయ్యను మెరుగైన వైద్యం కోసం తనభార్య చంద్రకళ జూన్ 11వ తేదీన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించింది. ఈ క్రమంలో జూన్ 16వ తేదీన దూలయ్య ముక్కు, ఎడమ కంటి భాగంలో బ్లాక్ ఫంగస్ వచ్చినట్టు ఎంజీఎం వైద్యులు నిర్ధారించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించేందుకు ఆర్థిక స్తోమత లేక ఎటూ పాలుపోక, మరోదారి లేక నిరుపేద రైతు దూలయ్య భార్య చంద్రకళ భర్తకు కంటి ఆపరేషన్ నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో జూన్ 20వ తేదీన చేర్చి వైద్యం చేయిస్తుంది. దూలయ్యకు సోమవారం కంటి ఆపరేషన్ చేస్తున్నట్టు, అతనికి రక్తం తక్కువగా ఉన్నట్టు, ఆపరేషన్ సమయంలో తన ఏ పాజిటివ్ రక్తం అవసర మని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇదిలా ఉండగా గత సంవత్సరం జూలై నెలలో తన కూతురు శ్రీలేఖ ట్రాక్టర్ ప్రమాదానికి గురికాగా, కూతురు వైద్యానికి సుమారు రూ.2,00,000 లక్షలు అప్పు చేశామని, ఇప్పుడు నా భర్తకు కరోనా, బ్లాక్ ఫంగస్ కారణంగా వైద్యం కోసం లక్ష రూపాయలు అప్పు చేసి చికిత్స చేయిస్తున్నానని భార్య తన గోడును వెలిబుచ్చుతుంది. ప్రస్తు తం అప్పు చేసి తెచ్చిన డబ్బులు తనభర్త ఆపరేషన్, మందులకు, రక్తం ఏర్పాటుకు సరిపోవని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
గతంలో కూతురు కోసం, ప్రస్తు తం భర్త కోసం చేసిన అప్పులు తీరేదెలాని? అలాగే ఈ సీజన్లో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వ్యవసాయం చేసే అవకాశమూ కోల్పోయా మని తీవ్ర ఆవేదనకు కలిగిస్తుందని దూలయ్య భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
మా ఈ నిరుపేద కుటుంబ దుర్భర పరిస్థితి చూసి స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు ఎవరైనా మాకు సహకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా ఆపన్నహస్తం ఇచ్చి ఆదుకోవాలని దూలయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు.