Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
ఐఎస్ఓ గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళా వేదిక నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీలో మండలంలోని మోరంపల్లిబంజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మేడిపల్లి సాయి రాసిన కవిత ఉత్తమ కవితగా ఎంపికైంది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో శ్రీశ్రీ కళా వేదిక వారు మేడిపల్లి సాయికి ప్రశంసా పత్రాన్ని అందచేశారు. అన్నదాత ఆకలి కేకలు అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీలో 346 మంది పలు రాష్ట్రాల తెలుగు కవులు పాల్గొనగా అందులో ఉత్తమ కవితగా మేడిపల్లి సాయి కవిత ఎంపికైంది. శ్రీశ్రీ కళా వేదిక చైర్మన్ జాషువా అవార్డ్ గ్రహీత డాక్టర్ కత్తి మండవ ప్రతాప్ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీల్లో సామాజిక అంశాలనే ఇతివృతంగా చేసుకుని కవితా పోటీలను నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. అందులో కవులందరూ కూడా వారి వారి దృష్టి కోణాలకు కవితా రూపం ఇవ్వడం అద్భుతమైన విషయం. అదేవిధంగా భద్రాద్రి సాహితీ వేదిక నుండి హరివిల్లు కవిభూషన్ అవార్డు సైతం మేడిపల్లి సాయి అందుకున్నారు. పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే కరోనా కష్ట కాలంలో హెల్పింగ్ హార్ట్స్ అనే సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళా వేదిక అందించిన జాతీయ స్థాయిలో ఉత్తమ కవితగా ఎంపికవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.