Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020-21 యాక్షన్ ప్లాన్‌పై మంత్రి అజయ్ సమీక్ష
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఆగష్టు 16 నుంచి సాగునీరు ఇస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ స్పష్టం చేశారు. టి.టి.డి.సి సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో వానాకాలం 2021-22 యాక్షన్ ప్లాన్ ను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్జన్ తో కలిసి మంత్రి సమీక్షించారు. వైరా, లంకాసాగర్ ఆయకట్టు రైతాంగం నాట్లు వేసుకోవడానికి ఇప్పటికే ఎటువంటి నీటి సమస్య లేదన్నారు. పాలేరు ఎన్.ఎస్.పి ఆయకట్టు రైతాంగానికి ఆగష్టు 16 నుండి నీరు విడుదల చేయాల్సిందిగా నల్లగొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని ఫోన్లో సంప్రదించగా...సుముఖత తెలిపారు.
జిల్లాలో 27 చెక్ డ్యామ్‌ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా 0.425 టి.ఎం.సిల నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు. కాబట్టి ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయ ద్వారా 842 పనులు పూర్తి చేసి 74,332 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించుకున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే రూ.40 కోట్లతో ఎత్తిపోతల పథకాలను బాగు చేసుకున్నామని, మరమ్మత్తులు అవసరమైతే 20 రోజులలో పనులు పూర్తి చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చీఫ్ ఇంజనీరు స్థాయి నుంచి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు స్థాయి వరకు నిధుల ఖర్చులకు ప్రభుత్వం అధికారాలు కల్పించిందన్నారు. అయినా పనుల్లో జాప్యం తగదన్నారు. జిల్లాలో పెడింగ్ లో ఉన్న 65 ఎత్తిపోతల పథకాల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది నుండి జులైలోపు మరమ్మతులు పూర్తి కావాలని మంత్రి సూచించారు. జిల్లాలో చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, ఎస్.ఆర్.ఎస్.పి కాలువలను కూడా పునరుద్ధరించుకొని నీటి నిల్వలు పెంపొందిం చుకోవడంతో ఆయకట్టు విస్తీర్ణం పెరుగుతుందని మంత్రి తెలిపారు. సాగునీటి వినియోగం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతాంగానికి తెలియపర్చేందుకు ప్రతి క్లస్టర్‌లోని రైతువేదికల్లో రైతు బంధు సమితి సభ్యులు, కో-ఆర్డిరేటర్ల భాగస్వామ్యంతో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు తెలిపేందుకు రైతువేదికలలో ప్రత్యేకంగా వ్యవసాయ విస్తరణాధికారి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాలో ఎన్ఎస్పి కాలువలు, నీటి వనరులు, సహజ ప్రవాహాల ఆక్రమణలు జరగకుండా చూడాలన్నారు. నీటి వనరులు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపై నీటి పారుదల చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వ్యవసాయ, నీటి పారుదల శాఖల అధికారుల సంయుక్త సమావేశాల ద్వారా సమస్యలు రాకుండా ఉంటాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు సూచించారు. వారానికోసారి రైతువేదికల్లో కచ్చితంగా సమావేశాలు జరగాలని రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు కోరారు. అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీరు జి . శంకర్ నాయక్, జిల్లా అధికారి ధన్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.