Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాసిత రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి
- విలేకర్ల సమావేశంలో మాజీ ఎంపీ మిడియం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణం కోసం సేకరించిన భూ సేకరణ పూర్తి చట్ట విరుద్దమని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మిడియం బాబురావు అన్నారు. సోమవారం ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము ప్రాజెక్టులు, అభివృద్ధిని తాము అడ్డు కోవడం లేదని, తాము అభివృద్ధిలో రాజీ లేని పోరాటాలు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులు నిర్మించే సమయంలో ముందుగా డీపీఆర్ ప్రకటించిన తర్వాత గ్రామ సభల్లో రైతుల నిర్ణయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భూ సేకరణ జరగాలన్నారు. కానీ సీతమ్మ సాగర్ భూ సేకరణ అంతా చట్ట విరుద్దంగా సాగడంతో పాటు వారికి అందించే పరిహారం మొక్కుబడిగా అందజేస్తున్నారని ఆయన అన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగంలో ప్రగళ్లపల్లి వద్ద ఎత్తిపోతల పధకానికి నిధులు కేటాయించి తక్షణమే పనులు మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవశాయ చట్టాల వలన వ్యవశాయం సంక్షోభంలో పడిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళనలో ప్రధానంగా ఏజన్సీ ప్రాంతంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు మధ్య లోపించిన సమన్వయం కారణంగా భూ సర్వే సక్రమంగా జరగలేదని తిరిగి రెవెన్యూ, ఫారెస్టు, ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించి రీ సర్వే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కష్ట కాలంలో ప్రజలు పిట్టల్లా రాలుతుంటే భర్తీ చేయాల్సిన వైద్యులు, ఫార్మాసిస్టులు పోస్టులు భర్తీ చేయక పోవడం భాధాకరమన్నారు. ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, కొర్సా చిలకమ్మ, లకీëనగరం సర్పంచ్ సరియం రాజమ్మ, మర్మం చంద్రయ్య, మర్మం సమ్మక్క తదితరులు ఉన్నారు.