Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ శాఖ కార్యాలయం ముట్టడించిన గిరిజనులు
- చర్చిస్తానన్నా ఎమ్మెల్యే రాక పోవటంపై ఆగ్రహం
- పోడుపై పోరాటం ఆపేదిలేదు
నవతెలంగాణ-కారేపల్లి
పోడులో పంటలేస్తే పాడుచేస్తుండ్రు.. ఫారెస్టు వేధింపులు పడలేకుండా ఉన్నాం... పోడు పోతే ఇక చావే గతి అదేదో ఇక్కడే చస్తాం... అంటూ గిరిజనులు మంగళవారం కారేపల్లి ఫారెస్టు రేంజ్ కార్యాలయం ముందు భైఠాయించి ఆందోళన దిగారు. కారేపల్లి ఫారెస్టు కార్యాలయానికి రండి న్యాయం చేస్తానన్నా వైరా ఎమ్మెల్యే, అధికారులు జాడ లేక పోవటంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాక పోతేగా ఇక మా గోడు ఎవరు వింటారు. అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు చేస్తున్నపేదలపై ఫారెస్టు అధికారులు వేధింపులను ఆపాలంటూ ఇటీవల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గిరిజనులు, గిరిజనేతర పేదలు వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ను కలిసి విన్నవించగా మంగళవారం కారేపల్లిలోనే ఫారెస్టు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుదామని ఎమ్మెల్యే మాట ఇచ్చారు. దానిని అనుసరించి గిరిజనులు, గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఫారెస్టు కార్యాలయానికి రాగా ఎమ్మెల్యే జాడ లేరు. కనీసం ఫారెస్టు రేంజ్ అధికారితో సమస్యలు చెప్పుకుందామన్నా అయన లేకుండా పోయాడు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఫారెస్టు కార్యాలయంను ముట్టడించారు. పేదలు ఆందోళన చేస్తునే ఫారెస్టు కార్యాలయంలోనే తెచ్చుకున్న సద్దులు తిన్నారు. కొందరు రైతులు బిక్షాటన చేసి వచ్చిన వస్తువులపై ఫారెస్టు కార్యాలయం వద్దనే వంటావార్పు నిర్వహించారు.
పోడుపై తప్పించుకునే వైఖరి విడనాడాలి
పోడు సమస్యపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో తప్పించుకునే వైఖరి విడనాడాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం నాయక్ అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పేదలను మభ్యపుచ్చి అవసరం తీరాక పట్టించుకోక పోవటం విచారకరమన్నారు. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే ఏజన్సీలో పేదలు భయం, భయంగా బతకాల్సిన పరిస్ధితి ఉందన్నారు. సెంటు భూమి లేని పేదోళ్లు, పోడుపైనే ఆధారపడి కుటుంబాలు బతుకుతున్నాయని, ఏమి పాపం చేశారని ప్రభుత్వం వారిపై అంత కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తుందని ప్రశ్నించారు. కారేపల్లి, ఏన్కూర్, కామేపల్లి, కొణిజర్ల, జూలూరుపాడు మండలాల్లోని గిరిజనులు, గిరిజనేతర పేదలు తాత కాలం నుండి పోడు పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాని తెలిపారు. పోడుకు హక్కు పత్రం కోసం దరఖాస్తు చేసి ఏండ్లు గడుస్తున్న అధికారులు సర్వేలతో సరిపుచ్చారు తప్ప హక్కు కల్పించలేదని సీఎం కేసీఆర్ పోడుకు హక్కు కల్పిస్తామని ప్రకటించారు. కాని ఫారెస్టోళ్లు పోడులోకి పోకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పంటలు వేస్తే పాడు చేస్తున్నారని, పోడులోకి అడుగుపెడితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర, తలారి దేవప్రకాశ్, ఉసిరికాయలపల్లి, విశ్వనాధపల్లి సర్పంచ్‌లు బానోత్ బన్సీలాల్, హలావత్ ఇందిరాజ్యోతి, సోసైటీ డైరక్టర్ కొత్తూరి రామారావు, గిరిజన సంఘం నాయకులు దారావత్ సైదులు, మాలోత్ రాంకోటి, సూరభాక ధనమ్మ, కే.ఉమావతి, కల్తి భద్రయ్య, యనమగండ్ల రవి, ఈసం మల్లమ్మ పాల్గొన్నారు.