Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కమిషనర్‌కి వినతి
- వెంటనే చర్యలు చేపడతా : కమిషనర్ హామీ
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లలో అనుమతులు లేకుండా ఇష్టా రాజ్యంగా ఏర్పాటు చేస్తున్న బోర్డులు తొలగించాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగర కార్పొరేషన్ కమిషనర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ చాలా చోట్ల రోడ్లు సరిపోవడం లేదని వెడల్పు చేస్తూ, మరో పక్క వెడల్పు చేసిన వరకు అడ్డంగా బోర్డులు పాతటం ఎంటని ప్రశ్నించారు, షాపులు, ఇండ్లు అని తేడా లేకుండా, యజమానుల అనుమతి లేకుండా ఎలా బోర్డులు పెడతారని వివరించారు. చివరికి విద్యుత్ పోరాటంలో అశువులుబాసిన సత్తెనపల్లి రామకృష్ణ స్థూపంకి కూడా అడ్డంగా బోర్డు పెట్టడం ఎటువంటి అనుమతులతో జరిగిందని వివరణ అడిగారు. లేదా నగరంలో అన్ని పార్టీలకు బోర్డులు పెట్టుకోనే శక్తి ఉందని అనుమతి ఇస్తే అందరికీ ఇవ్వాలని కోరారు. లేని యెడల అధికారుల ఈ పక్షపాతి ధోరణి పై దశల వారి ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ వెంటనే ఈ విషయంమై విచారించి తగిన చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు.
వినతిపత్రం అందజేసిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీ నివాసరావు, వై.విక్రమ్, తుశాకుల లింగయ్య, కాంపాటి వెంకన్న, శీలం వీరబాబు తదితరులు పాల్గొన్నారు.