Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
సస్యరక్షణ నివారణ చర్యల ద్వారా పత్తిలో అధిక దిగుబడి సాధించవచ్చునని మండల వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. పత్తిలో ప్రధానంగా గులాబీరంగు కాయతొలుచు పురుగు, వేరు కుళ్లు తెగులు ఆశిస్తాయి వీటి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా నివారించవచ్చును. గులాబీ రంగు కాయ తొలుచు పురుగు పత్తి పంటలో పూత దశ నుంచి (45 రోజుల నుంచి) ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటుంది. లేత పూ మొగ్గలు ఆశించి తినడం వల్ల గుడ్డిపూలుగా ఏర్పడి పత్తి పంట దిగుబడులను తగ్గిస్తుంది. గులాబీ రంగు కాయతొలుచు పురుగును గమనించిన తొలి దశలో లింగాకర్షణ బుట్టలు ఎకరాకు 4 నుంచి 5 ఆమర్చుకోవడం ద్వారా పురుగు ఉదృతి కొంత మేరకు తగ్గించవచ్చు. ఇమ్మామెక్టిన్ బెంజోయేట్ 5% యెస్ జి 0.5 గ్రాములు లీటర్ లేదా కొరాజిన్ 0.5 మిలీ లేదా లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. తొలిదశలో ఈ పురుగు గమనించినట్లయితే వేప నూనె 5 మిలీ లేదా లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పచ్చ దోమ, తెల్లదోమ, పేను బంక (రసం పీల్చే పురుగులు)
పంట వివిధ దశలలో ఈ పురుగులు ఆశించి ఆకుల నుంచి రసాన్ని పీల్చి కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం కలిగిస్తాయి. ఈ పురుగుల నివారణకు తొలిదశలో వేప నూనె ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా పురుగులను కొంతమేరకు తగ్గించవచ్చు. ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూడిజి 0.17 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా రసం పీల్చే పురుగులు తగ్గించవచ్చు. అలాగే ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్పత్తిలో కాండంపై ప్రతి 20, 40, 60 రోజులకి ఒకసారి పూత పూయడం ద్వారా నివారించవచ్చు.
వేరుకుళ్ళు తెగులు
తెగులు నివారణకు ముందుగా దుక్కిలో ఎకరాకు ట్రైకోడెర్మా విరిడి 2 కేజీలు 2 క్వింటాల పశువుల ఎరువుతో కలిపి వేసుకోవాలి. మెటలాక్సైల్ 8 శాతం ం మాంకోజెబ్ 64 శాతం డబ్ల్యూ పి 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. కాపర్ ఆక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా ఈ తెగులు ఉదృతిని తగ్గించవచ్చు నని పేర్కొన్నారు. ఈ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగుల నివారణను తగ్గించి రైతులు అధిక దిగుబడి సాధించుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.