Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరేళ్లుగా సమస్యల వలయంలో లో ఉపాధ్యాయులు
- టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి రాంబాబు
నవతెలంగాణ- బోనకల్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం సంక్షోభంలో ఉందని, ఆరేళ్లుగా ఉపాధ్యాయులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ మండల స్థాయి విస్తత సమావేశం ఆ సంఘం మండల అధ్యక్షుడు కంభం రమేష్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జీవోలు ఇచ్చిన వాటికి కూడా నేటికీ మోక్షం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కలగానే మిగిలిపోతోందని, చిరకాల డిమాండ్లకు మోక్షం లభించడం లేదని విమర్శించారు. సాక్షాత్తూ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనలూ కార్యరూపం దాల్చడం లేదన్నారు. గత ఏడాది అన్ని శాఖల్లో పదోన్నతులు ఇచ్చినా.. పాఠశాల విద్యా శాఖలో మాత్రం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆంగ్ల మాధ్యమ విద్యనందించే మోడల్(ఆదర్శ) పాఠశాలలు 2013లో ఏర్పాటయ్యాయని, కానీ వాటిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఏడాది క్రితం వరకు సర్వీస్ నిబంధనలే లేవన్నారు. ఎనిమిదేళ్లు అవుతున్నా పదోన్నతులు, బదిలీలు లేవు, మెడికల్ రీయింబర్స్మెంట్ వర్తించడం లేదు, ఆరోగ్య కార్డులు లేవని, మళ్లీ నియామక ప్రకటనా రాలేదన్నారు. 88 ప్రిన్సిపాళ్లు, 477 పీజీటీ, 985 టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సమావేశంలో ఆ సంఘం మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, నాయకులు పి.సుశీల, ఎంసిఆర్ చంద్ర ప్రసాద్, జీ.ప్రీతం, పి.నరసింహారావు, ఆలస్యం పుల్లారావు, కే.అనిల్ కుమార్, శ్రీనివాసరావు, పి.గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.