Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూముల విలువ 30శాతం నుంచి 50శాతం పెంపు
- కరోనా సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీల మోత
- 6శాతం నుంచి 7.5శాతం పెరిగిన రిజిస్ట్రేషన్ రుసుం
- ఖమ్మం జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.150 కోట్ల భారం
- నేటి నుంచి అమల్లోకి రానున్న పెరిగిన రేట్లు
రెండేళ్లకోసారి పెంచాల్సిన భూముల విలువను తెలంగాణ ప్రభుత్వం 8 ఏళ్లుగా పెంచలేదు. దీనివల్ల రైతులు, ప్రజలకు తీరని నష్టం జరిగింది. వ్యవసాయ భూములు, ప్లాట్లపై అధికమొత్తంలో రావాల్సిన రుణాలను కోల్పోయారు. వివిధ ప్రాజెక్టులు, రోడ్లు, కాల్వల కింద భూములు, స్థలాలు కోల్పోయిన వారు తక్కువ పరిహారంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం భూముల విలువను 30% నుంచి 50% పెంచింది. ఇదే అదనుగా కరోనా సమయంలో సామాన్య ప్రజలపై భారం మోపుతూ పనిలో పనిగా రిజిస్ట్రేషన్ రుసుమును సైతం పెంచింది. భూముల విలువ పెరగడంతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగడం మూలంగా ప్రజలపై అదనంగా భారం పడనుంది. ఖమ్మం జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.150 కోట్ల భారం పడుతుంది. జిల్లాలోని 11 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రిజిస్ట్రేషన్ రుసుముల రూపేణా రూ.150 కోట్ల ఆదాయం వస్తుండగా ఇప్పుడా ఆదాయం రెట్టింపు కానుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన భూముల విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ చార్జీలను గురువారం నుంచి అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నవారు సైతం పెరిగిన చార్జీల ఆధారంగానే రుసుము చెల్లించాలి.
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పంచాయతీల్లో రిజిస్ట్రేషన్ ఫీజు 1.5 శాతం పెంచారు. గతంలో 0.5 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును రెండుశాతం చేశారు. స్టాంప్ డ్యూటీని 5.5 శాతానికి పెంచారు. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ కలిపి 7.5 శాతానికి చేరుకుంది. గతంలో ఇది 6 శాతంగా ఉండేది. గతంలో ఖమ్మంలో ఓపెన్ ప్లాట్ చదరపు గజం రూ.15,000 ఉన్న దాన్ని ఇప్పుడు రూ.19,000వేలకు పెంచారు. 150 గజాలున్న ఓ ప్లాట్ విలువ నాడు రూ.22.50 లక్షలుంటే ఇప్పుడు దాని విలువ రూ.28.50 లక్షలకు చేరింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి నాడు సుమారు 1,35,000 అయ్యేది. నేడు అదే విస్తీర్ణంలో ఉన్న ప్లాట్‌కు రూ.2,13,750 వరకు అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన రూ.78,750 రిజిస్ట్రేషన్ చార్జి కొనుగోలుదారులపై అదనంగా పడనుంది. మ్యుటేషన్ చార్జి 0.1శాతం కలిపితే ఈ భారం ఇంకొంత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. గతంలో రూ.300 ఉన్న వ్యవసాయేతర ఆస్తుల విలువ ఇప్పుడు రూ.500కు చేరింది. ఆమేరకు రిజిస్ట్రేషన్ చార్జీ కూడా అదనం కానుంది. ఉదాహరణకు గతంలో తిరుమలాయపాలెం మండలంలో గజం స్థలం మార్కెట్ విలువ ప్రకారం రూ.300 ఉంటే ఇప్పుడది 50శాతం పెరిగింది. రూ.500కు చేరింది. పంచాయతీలు, మండల హెడ్‌క్వార్టర్స్, మున్సిపాల్టీలు, కార్పొరేషన్, సుడా పరిధిలో మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలూ పెంచారు. సెంట్రల్ వాల్యూయేషన్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ చార్జీల పెంపు ఉండేలా చూశారు. గతంలో ఉన్న భూ విలువతో పాటు చార్జీలు 50శాతం మించకుండా చూశారు. గతంలో ఉచితంగా చేసే గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సైతం ఇప్పుడు చార్జి విధిస్తున్నారు. ఇలా భూ విలువ పెంపుతో పాటు చార్జీలను సైతం పెంచి ప్రభుత్వం కరోనా సమయంలో రూ.కోట్లు కూడబెట్టుకునే పనిలో ఉంది.
రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుతుంది
- రవీందర్, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్, ఖమ్మం
భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా పెరుగుతుంది. జిల్లా మొత్తమ్మీద ఏడాదికి గతంకంటే రూ.100 కోట్లైనా అధికంగా వచ్చే అవకాశం ఉంది. గతంలో జిల్లాలో రూ.150 కోట్లు వచ్చేవి. ఇక మీదట ఈ ఆదాయం డబుల్ అవుతుందని భావిస్తున్నాం. పెంచిన భూ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.
పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను ఉపసంహరించుకోవాలి...
- నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
భూముల విలువ పెంచడం అవసరం. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ భూముల విలువ పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం. దీనివల్ల అధికమొత్తంలో రైతులకు బ్యాంకులు రుణాలిస్తాయి. భూ నిర్వాసితులకు కూడా ప్రయోజనం. కానీ దీన్ని అడ్డుపెఉ్టకుని పనిలో పనిగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం మాత్రం సమంజసం కాదు. దీని ఫలితంగా మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుంది. రిజిస్ట్రేషన్ చార్జీల ధరలను ఉపసంహరిం చుకోవాలి. కరోనా నేపథ్యంలో ప్రజల ఆదాయం కుచించుకు పోయింది. ఇటువంటి సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ఏమాత్రం సహేతుకం కాదు. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించే విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.