Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీడు భూములుగా పంట పొలాలు
- ఆర్థిక మంత్రి నియోజకవర్గానికి తరలింపు
- మండల రైతుల ఎదురుచూపులు
నవతెలంగాణ- బోనకల్
ఎనిమిది నెలల క్రితం పామాయిల్ సాగు కోసం అన్నదాతలు దరఖాస్తులు చేసుకున్నారు. జూన్ నెలలోనే మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. కానీ నేటి వరకూ పంపిణీ చేయలేదు. దీంతో అన్నదాతలు ఆ భూములలో ఎటువంటి పంట సాగు చేయకుండా ఉంచారు. దీంతో ఆ భూములు బీడు భూములుగా మారాయి.
మండల పరిధిలోని గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు, నారాయణపురం, చొప్పకట్లపాలెం గ్రామాలకు చెందిన మరో 13 మంది రైతులు పామాయిల్ సాగు కోసం గత ఏడాది నవంబర్లో మధిర ఉద్యానవన అధికారికి దరఖాస్తులు చేసుకున్నారు. అన్నదాతలు దరఖాస్తులు చేసుకున్న సమయంలో ఉద్యానవన శాఖ అధికారులు జూన్ ప్రారంభంలోనే పామాయిల్ మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో అన్నదాతలు పామాయిల్ మొక్కలు నాటే భూములలో ఎటువంటి పంటలు సాగు చేయకుండా వదిలివేశారు. ఎకరానికి 57 మొక్కలు నాటవలసి ఉంది. ఈ మొక్కలను ఉద్యానవన శాఖ అధికారులు సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తారు. ఒక్కొక్క మొక్కకు రైతులు 33 రూపాయలు చెల్లించవలసి ఉంది. రైతులే మొక్కలు నాటుకోవాలి. ఇందుకు ఒక్కొక్క మొక్క నాటేందుకు 150 రూపాయలు ఖర్చు వస్తుంది. ఖర్చును రైతులే భరించవలసి ఉంది. ఒక్కసారి మొక్క నాటిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి పంట దిగుబడి వస్తుంది. మండలంలో మొట్టమొదటగా పామాయిల్ పంటను సాగు చేసేందుకు ఈ మూడు గ్రామాల రైతులు ముందుకు వచ్చారు. ఉద్యానవన శాఖ అధికారులు మండలంలో పామాయిల్ సాగుపై ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వమే పామాయిల్ మొక్కలను సబ్సిడీపై సరఫరా చేస్తుందని ప్రచారం చేయటంతో అన్నదాతలు ఆసక్తిగా ముందుకు వచ్చారు. పామాయిల్ పంట సాగు చేసేందుకు అన్ని రకాలుగా భూములను సిద్ధం చేసుకొని అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. రెండు నెలలుగా పామాయిల్ మొక్కల కోసం ఉద్యానవన శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పామాయిల్ పంటకు కేంద్రంగా ఉన్న అశ్వరావుపేటలో మొక్కల కొరత ఉందని, అందువలన సకాలంలో మొక్కలను సరఫరా చేయలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారని అన్నదాతలు అంటున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. అశ్వరావుపేటలో ఉన్న పామాయిల్ మొక్కలను తమకు అందించకుండా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నియోజకవర్గానికి జిల్లా అధికారులు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అశ్వరావుపేట నుంచి తెలంగాణ రాష్ట్రంలోని సగం జిల్లాలకు పామాయిల్ మొక్కలను సరఫరా చేస్తున్నారన్నారు. పామాయిల్ మొక్కల కొరత ఉందని తమకు చెబుతూ మిగతా ప్రాంతాలకు మొక్కలను సరఫరా చేయడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్ మొక్కల కోసమే తాము ఇతర పంటల సాగు చేయకుండా భూములను అలాగే ఉంచామని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ఉద్యానవన శాఖ అధికారులు తగిన సమయంలో పామాయిల్ మొక్కలు సరఫరా చేయాలని మండల అన్నదాతలు కోరుతున్నారు.
మొక్కలు సరఫరా చేస్తారా లేదా
: పోలూరి విజయ, గోవిందాపురం
గత ఏడాది నవంబర్లో పామాయిల్ సాగు కోసం దరఖాస్తులు చేసుకున్నాం. ఈ ఏడాది జూన్ లోనే మొక్కలు అందిస్తామని అధికారులు చెప్పారు. కానీ నేటి వరకు మొక్కల పంపిణీ చేయలేదు. వానాకాలం పంటలు అందరూ రైతులు తమ తమ పొలాల్లో వివిధ రకాల పంటలను సాగు చేసుకున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల మాటలు నమ్మి మా పొలాలను పామాయిల్ మొక్కల కోసం సిద్ధం చేసి ఉంచు కొన్నాము. అసలు మొక్కలు ఇస్తారా లేదా ఆ భూములలో ఇతర పంటల సాగు చేసుకోవాలా వద్దా అనే విషయం కూడా అధికారులు స్పష్టంగా చెప్పాలి.
ఆరు ఎకరాల సాగు కోసం దరఖాస్తు చేసుకున్నాను
: పోలూరి రామారావు
ఉద్యానవన శాఖ అధికారులు ప్రచారంతో తమ కుటుంబం ఆరు ఎకరాల్లో పామాయిల్ సాగు కోసం దరఖాస్తు చేసుకున్నాము. ఆ ఆరు ఎకరాల లో ఎటువంటి పంట సాగు చేయకుండా ఖాళీగానే ఉంచాము. కానీ అధికారులు మాత్రం నేటి వరకు పామాయిల్ మొక్కలు సరఫరా చేయలేదు.
మండలంలో పది హెక్టార్లకే అనుమతి
: మధిర నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి వేణు
బోనకల్లు మండలానికి పది హెక్టార్లలో పామాయిల్ సాగుకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కానీ మండలం నుంచి 21 మంది రైతులు 28 హెక్టార్ లలో పామాయిల్ సాగు కోసం దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు. అశ్వరావుపేటలో మొక్కల కొరత ఉన్నందువలన బోనకల్ మండల రైతాంగానికి పామాయిల్ మొక్కలు సరఫరా చేయలేక పోతున్నామని తెలిపారు. అంతే తప్ప ఇక్కడ నుంచి ఎక్కడికి మొక్కలు పంపిణీ జరగడం లేదని తెలిపారు. మొక్కలు పెరగగానే బోనకల్ మండలం రైతాంగానికి వెంటనే పామాయిల్ మొక్కల సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. మధిర నియోజకవర్గంలో 70 హెక్టార్లలో పామాయిల్ పంట సాగుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. అశ్వరావుపేట కేంద్రం నుంచి రాష్ట్రంలోనే దాదాపు సగం జిల్లాలకు పైగా పామాయిల్ మొక్కల సరఫరా జరుగుతుం దని తెలిపారు. కొత్త జిల్లాల లో పామాయిల్ సాగుకు కేంద్ర ప్రభుత్వం మొదట ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించిందని ఆయన తెలిపారు. అందుకోసమే ప్రభుత్వం కూడా మొదటి ప్రాధాన్యత కొత్త జిల్లాలలో పామాయిల్ సాగు పెంచాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతాలకు మొదటగా మొక్కల పంపిణీ చేస్తున్నారన్నారు.