Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములకలపల్లి- అన్నపురెడ్డిపల్లి రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు
- అంబులెన్స్ లకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-ములకలపల్లి
ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ములకలపల్లి-అన్నపురెడ్డిపల్లి రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ముందస్తుగా సమాచారం లేకుండా ప్రధాన రహదారి ని అడ్డంగా తవ్వి పైపులైన్ మరమ్మతులు చేస్తున్నారు. విషయం తెలియని ప్రయాణికులు అటుగా వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రధాన రహదారులను తవ్వే ముందు ప్రత్యామ్నాయ మార్గం వేయకుండా పనులు సాగిస్తున్నారు. మరమ్మతులకు సంబంధించిన సమాచారం పత్రికల ద్వారా, నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాల్సిఉన్నప్పాటికీ అధికారులు ఇవ్వలేదు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసి అధికారులు చోద్యం చూస్తున్నారు.
- ప్రధాన రహదారి కావడంతో తీవ్ర ఇబ్బందులు
సత్తుపల్లి నుంచి ములకలపల్లి మీదుగా పాల్వంచ వెళ్లేందుకు ప్రజలు ఈ మార్గం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డును అడ్డంగా తవ్వడంతో రెండు రోజులుగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురువ్వుతున్నారు. ఈ మార్గం నుంచి అత్యవసరంగా అంబులెన్స్ లు వచ్చినా కమలాపురం నుంచి జగన్నాధపురం మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీని మూలంగా అత్యవసరం గా వైద్యం అందాల్సిన రోగుల బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భారీ లోడుతో వచ్చిన లారీ రోడ్డుకు అడ్డంగా ఇరుక్కు పోయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి కాంట్రాక్టర్ తవ్విన రహదారి మట్టి కొట్టుకుపోయి ప్రమాద భరితంగా మారిపోయింది.