Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి మద్యం సీసాలను తరలిస్తూ వత్సవాయి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు మహిళలు గురువారం పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కృష్ణా జిల్లా వత్సవాయి ఎస్సై జి మహాలక్ష్మణుడు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణానికి చెందిన శివరాత్రి సుజాత, కుంచెపు ఉపేంద్ర గత కొంత కాలంగా సులభతరంగా సంపాదనకు అలవాటు పడి, అక్రమ సంపాదనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం సరఫరాకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 115 మద్యం సీసాలను కొనుగోలు చేసి ప్రయాణికురాళ్ళుగా ఆటోలో వత్సవాయి వెళ్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన వత్సవాయి చెక్ పోస్ట్ వద్ద చెక్ పోస్ట్ సిబ్బందితోపాటు ఎస్ఐ మహాలక్ష్మణుడు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు మహిళలు పెద్ద ఎత్తున మద్యం సీసాలతో వత్సవాయి వస్తున్నారని వత్సవాయి సీఐకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్సై చెక్ పోస్ట్ వద్ద నిఘా ఉంచారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బస్తాలో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఆ ఇద్దరు మహిళలను వత్సవాయి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ ఇద్దరి మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి మద్యం అక్రమంగా తరలిస్తుడటంతో చెక్ పోస్ట్ వద్ద నిఘా పెంచారు. వరుసగా అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తున్న వత్సవాయి పోలీసులను, చెక్ పోస్ట్ సిబ్బందిని నందిగామ డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.